పుట్టుమచ్చలు చూపాలంటూ వేధింపులు

10 Mar, 2023 03:48 IST|Sakshi

విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న ఇన్‌చార్జ్‌ హెడ్‌ మాస్టర్‌ 

ఎన్జీవో సంస్థ ప్రతినిధి ద్వారా అకృత్యాలు వెలుగులోకి..  

హెడ్‌ మాస్టర్‌ను సస్పెండ్‌ చేసిన డీఈవో

కేసు లేకుండా చూసేందుకు టీడీపీ నేతల యత్నం 

సాక్షి ప్రతినిధి, అనంతపురం/తనకల్లు: పుట్టుమచ్చలు చూపాలంటూ విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న ఉపాధ్యాయుడి లీలలు ఆలస్యంగా వెలుగుచూశాయి. విచారణ జరిపిన అధికారులు ఆయనను గురువారం సస్పెండ్‌ చేశారు. శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్లగుట్లపల్లె జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జీవీ ఆదినారాయణ ఇన్‌చార్జ్‌ హెడ్‌మాస్టర్‌. పుట్టుమచ్చలు చూపాలంటూ కొన్ని రోజులుగా 8, 9, 10 తరగతి విద్యార్థినులపై  లైంగిక వేధింపులకు పాల్పడుతూ వచ్చారు.

ఆయనకు భయపడిన విద్యార్థినులు తల్లిదండ్రులకు విషయం చెప్పలేకపోయారు. కాగా, జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా పాఠశాలలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వచ్చిన ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధితో పాఠశాలకు చెందిన ఓ బాలిక తన గోడును వెళ్లబోసుకుంది. దీంతో ఆ ప్రతినిధి ఆ తర్వాత కూడా కొన్ని రోజుల పాటు ఆ ఉపాధ్యాయుడి వ్యవహారశైలిని పరిశీలించి, అతడి అకృత్యాలు నిజమేనని నిర్ధారించుకున్నారు.

అనంతరం జిల్లా విద్యాశాఖాధికారి మీనాక్షికి సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన అధికారులు విచారణ జరిపి జీవీ ఆదినారాయణను సస్పెండ్‌ చేశారు. ఇదిలా ఉండగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, ఆదినారాయణపై పోక్సో కేసు నమోదు చేయాలని ఎంఈవో లలితమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

టీడీపీ నేతల రాజీ యత్నం
ఉపాధ్యాయుడు జీవీ ఆదినారాయణ భార్య రామలక్ష్మి గతంలో టీడీపీ ఓబుళదేవర చెరువు మండలం జెడ్పీటీసీగా పనిచేశారు. ఇప్పటికీ టీడీపీలో క్రియాశీలంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసును నీరుగార్చేందుకు శ్రీసత్యసాయి జిల్లా టీడీపీ ముఖ్యనేత ఒకరు తీవ్రంగా యత్నిస్తున్నారు.

జీవీ ఆదినారాయణ వయసు ప్రస్తుతం 61 ఏళ్లు కావడం, కేసు బలంగా ఉంటే పదవీ విరమణ తర్వాత వచ్చే ప్రయోజనాలు రావన్న ఉద్దేశంతో కేసు నీరుగార్చేలా అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో­నే బాలికల  తల్లిదండ్రులతోనూ రాజీ ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.


 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు