దళిత యువకుడిపై చేయి చేసుకున్న ఎస్‌ఐ, ఏఎస్‌ఐ

5 Sep, 2020 05:55 IST|Sakshi
ఆందోళనకారులతో చర్చలు జరుపుతున్న సీఐ జయకుమార్‌

అనంతరం క్షమాపణ కోరిన ఇద్దరు 

ఆ తర్వాత ఆత్మహత్యకు యత్నించిన ఏఎస్‌ఐ  

రంగంపేట (తూర్పు గోదావరి): దళిత యువకుడిపై ఇన్‌చార్జి ఎస్‌ఐ, ఏఎస్‌ఐ చేయిచేసుకున్న ఘటన తూర్పు గోదావరి జిల్లా రంగంపేటలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పెదరాయవరం గ్రామానికి చెందిన మోర్త నవీన్‌ అనే యువకుడు గ్రామానికి చెందిన ఓ యువతిని వేధించినట్టు ఫిర్యాదు అందటంతో గురువారం రాత్రి అతడిని రంగంపేట పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చారు. అతడిని విచారించే క్రమంలో ఇన్‌చార్జి ఎస్‌ఐ వి.కిశోర్, ఏఎస్‌ఐ సుబ్బారాయుడు చేయి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న సుమారు 200 మంది దళితులు స్టేషన్‌కు చేరుకుని ధర్నా నిర్వహించారు.

ఇరువర్గాల పెద్దలు రాజీ కుదిర్చిన తరువాత కూడా యువకుడిని కొట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. పరిస్థితి అదుపు తప్పడంతో పెద్దాపురం సీఐ జయకుమార్‌ రంగంపేట చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. ఇన్‌చార్జి ఎస్‌ఐ కిశోర్, ఏఎస్‌ఐ సుబ్బారావులతో క్షమాపణ చెప్పించడంతో దళితులు ఆందోళన విరమించారు. ఇన్‌చార్జి ఎస్‌ఐని బాధ్యతల నుంచి తొలగించామని, అధికారుల సూచన మేరకు ఏఎస్‌ఐపై నివేదిక సమర్పిస్తామని సీఐ చెప్పారు.  

ఏఎస్‌ఐ ఆత్మహత్యాయత్నం: ఈ ఘటనతో మనస్తాపం చెందిన ఏఎస్‌ఐ స్టేషన్‌ పక్కనే ఉన్న క్వార్టర్స్‌ గదిలోకి వెళ్లి  గడియ పెట్టుకుని ఫ్యాన్‌కు లుంగీతో ఉరేసుకునేందుకు యత్నించారు. వెంటనే సీఐ జయకుమార్, హెడ్‌ కానిస్టేబుల్‌ రాంబాబు తలుపులు పగులగొట్టి సుబ్బారావును రక్షించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

మరిన్ని వార్తలు