రూ.40 లక్షలు వసూలు చేసి పారిపోతుండగా..

19 Nov, 2020 10:12 IST|Sakshi

హుజూరాబాద్‌రూరల్‌: చెల్పూర్‌ గ్రామానికి చెందిన మోడం రవీందర్, అతని భార్య శ్రీదేవి చిట్టీల పేరుతో పలు గ్రామాల్లో అమాయక ప్రజలను మోసం చేశారు. తోకలపల్లికి చెందిన దేవేందర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో వారు నగదుతో పారిపోతుండగా హుజూరాబాద్‌ టౌన్‌ సీఐ వాసంశెట్టి మాధవి మంగళవారం పట్టుకున్నారు. ఆమె వివరాల ప్రకారం.. రవీందర్, శ్రీదేవిలు చెల్పూర్, తోకలపల్లి, శాలపల్లి ఇందిరానగర్‌ గ్రామాల్లో అమాయక ప్రజల నుంచి చిట్టీల పేరుతో రూ.40 లక్షలు వసూలు చేశారు. అనంతరం తమ కుమారుడితో కలిసి నగదు తీసుకొని పారిపోతుండగా పరకాలక్రాస్‌ రోడ్‌ వద్ద పోలీసులు పట్టుకున్నారు. నిందితులను కోర్టులో హాజరు పరుస్తామని సీఐ తెలిపారు. చిట్టీల పేరుతో మోసం చేసే వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  

బాధితుల నుంచి వివరాలు సేకరణ..
సీఐ ఆదేశాల మేరకు చెల్పూర్‌ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఎస్సై శ్రీనివాస్‌ బుధవారం విచారణ చేపట్టారు. బాధితులు ఆయనకు పలు వివరాలు చెప్పారు. గ్రామానికి చెందిన రవీందర్‌ ఎటువంటి అనుమతులు లేకుండా చిట్టీల వ్యాపారం చేసున్నాడని తెలిపారు. అతన్ని నమ్మి ఊళ్లో చాలా మంది చిట్టీలు వేశారని పేర్కొన్నారు. బాధితులందరికీ న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌ నేరెళ్ల మహేందర్‌గౌడ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు