టీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే కొడుకుపై చీటింగ్‌ కేసు

22 Oct, 2021 05:31 IST|Sakshi

పెళ్లి చేసుకుంటానని చెప్పి మహిళను మోసం చేశాడని ఆరోపణ

కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో మృగేందర్‌ బానోత్‌పై యువతి ఫిర్యాదు

సాక్షి, హైదరాబాద్‌: ఖమ్మం జిల్లా వైరా టీఆర్‌ఎస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌ బానోత్‌ కొడుకు మృగేందర్‌లాల్‌ బానోత్‌ (30)పై చీటింగ్‌ కేసు నమోదయింది. తనని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి, అత్యాచారం చేశాడని ఓ యువతి మృగేందర్‌లాల్‌పై గత నెల 27వ తేదీన కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. మృగేందర్‌లాల్‌తో పాటు మాజీ ఎమ్యెల్యే మదన్‌లాల్‌ బానోత్‌పై కేసులు నమోదయ్యాయి. యువతి ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

2019లో ఐపీఎస్‌కు ఎంపికైన మృగేందర్‌ శివరాంపల్లిలోని పోలీస్‌ అకాడమీలో శిక్షణ పొందే సమయంలో కూకట్‌పల్లికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ప్రతి రోజూ ఆమెతో చాటింగ్‌ చేసేవాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. గతేడాది డిసెంబర్‌ 25న పథకం ప్రకారం యువతిని తన రూమ్‌కు తీసుకెళ్లి బలవంతం చేయబోయాడు. కానీ, ఆమె ప్రతిఘటించడంతో వెనక్కి తగ్గాడు. కొద్దిరోజుల అనంతరం తన కుటుంబ సభ్యులకు పరిచయం చేస్తానని, అకాడమీకి రావాలని చెప్పడంతో ఆ యువతి నమ్మి వెళ్లింది. అక్కడ తన కోరికను తీర్చకపోతే వివాహం చేసుకోనని బ్లాక్‌మెయిల్‌ చేయడంతో వేరే మార్గం లేక ఆ యువతి అంగీకరించింది.

ఇక ఆ తరువాత ముఖం చాటేసిన మృగేందర్‌ పలుమార్లు ఆ యువతి పెళ్లి ప్రస్తావన తెచ్చినా రకరకాల కారణాలతో వాయిదా వేస్తూ వచ్చాడు. గతేడాది ఆగస్టులో మృగేందర్‌లాల్‌ ఐఏఎస్‌కు ఎంపికయ్యాడు. ఐపీఎస్‌కు రాజీనామా చేసి ముస్సోరిలోని లాల్‌బహదూర్‌ శాస్త్రి నేషనల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అకాడమీలో చేరాడు. అక్కడ మృగేందర్‌కు మరొక అమ్మాయితో (ఐఏఎస్‌ బ్యాచ్‌మేట్‌) దగ్గరి సంబంధం ఉందని ఆ యువతి నిలదీయడంతో మృగేందర్‌ తండ్రి మదన్‌లాల్‌ బానోత్‌ యువతికి రూ.25 లక్షల నగదు ఇస్తానని ఆశ చూపించాడు.

యువతి ఒప్పుకోకపోవడంతో చంపేస్తామని ఆమె కుటుంబ సభ్యుల ముందే బెదిరించాడు. ఈ ఏడాది జూలై 31వ తేదీన మృగేందర్‌ యువతి ఇంటికి వచ్చి బలవంతంగా ఆమె సెల్‌ఫోన్‌ ధ్వంసం చేసినట్లుగా యువతి ఆరోపిస్తోంది. దీంతో ఆమె న్యాయం చేయాలని కోరుతూ కూకట్‌పల్లి పోలీసులను ఆశ్రయించింది. అయితే ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. కేసు వివరాలను తెలుసుకునేందుకు ‘సాక్షి’ప్రతినిధి సంబంధిత పోలీసు అధికారులను సంప్రదించగా.. అలాంటి కేసు ఏమీ నమోదు కాలేదని పోలీసులు వెల్లడించడం విశేషం. 

మరిన్ని వార్తలు