లక్షలు దండుకున్న టీడీపీ నాయకుడు..చీటింగ్‌ కేసు నమోదు

17 Jul, 2021 08:58 IST|Sakshi
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కోడి నాగరాజుయాదవ్‌ (ఫైల్‌)

సాక్షి,కర్నూలు: బనగానపల్లె మార్కెట్‌ యార్డు మాజీచైర్మన్, టీడీపీ నాయకుడు కోడి నాగరాజు యాదవ్‌పై  బనగానపల్లె పోలీసులు చీటింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బనగానపల్లె మండలం బత్తులూరుపాడుకు చెందిన పసుపుల మధుసూదన్‌రెడ్డి, సోముల ప్రసాద్‌రెడ్డి బావ, బావమరుదులు. వీరు హైదరాబాద్‌లో ఉంటారు. తెలంగాణ ప్రభుత్వంలో వీరికి మంచి పలుకుబడి ఉందని, ఉద్యోగాలు ఇప్పిస్తారని కోడి నాగరాజు యాదవ్‌ బనగానపల్లెకు చెందిన షేక్‌ అర్షద్‌ బాషా సోదరులను పరిచయం చేయించారు. షేక్‌ అర్షద్‌బాషా హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన తమ్ముడు అబిద్‌బాషా కూడా హైదరాబాద్‌లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు.

కోడి నాగరాజు యాదవ్‌ చెప్పిన మాటలు నమ్మి పసుపుల మధుసూదన్‌రెడ్డి ఖాతాలో రూ. 10.60 లక్షలు, సోముల ప్రసాద్‌రెడ్డి ఖాతాల్లో రూ.లక్ష జమ చేశారు. కాగా ఇప్పటివరకు ఉద్యోగం ఇప్పించకపోగా తీసుకున్న డబ్బులు కూడా తిరిగి ఇవ్వక పోవడంతో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉద్యోగాల పేరుతో ఇంకా ఎంతమందితో ఇలా డబ్బులు వసూలు చేశారనే కోణంలో విచారిస్తున్నారు. తెలంగాణతో పాటు ఏపీలో కూడా కొంతమంది నిరుద్యోగ యువకుల నుంచి భారీ మొత్తంలో వారు డబ్బులు వసూలు చేసినట్లు ప్రాథమికంగా పోలీసులు అంచనాకు వచ్చినట్లు సమాచారం.

దళారుల మాటలు నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దు : ఎస్పీ  
ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో పోలీసు ఉద్యోగాలు, జూనియర్‌ అసిస్టెంట్, అటెండర్‌ వంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని మంచి అవకాశమంటూ కొందరు దళారులు మోసాలకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారి మాటలు నమ్మి మోసపోవద్దని ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో హెచ్చరించారు. ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగ యువతకు ఎస్పీ సూచించారు. ఉద్యోగాల పేరుతో ఎవరైనా మోసపోయింటే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. బనగానెపల్లె మార్కెట్‌యార్డ్‌ మాజీ చైర్మన్‌ కోడి నాగరాజుయాదవ్‌తో పాటు మరో ఇద్దరిపై నమోదైన కేసులో దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.    

మరిన్ని వార్తలు