బనియన్ల నిండా బంగారం, నగదే

3 Feb, 2024 08:44 IST|Sakshi

కర్నూలు జిల్లాలో నలుగురి నుంచి 4.565 కిలోల బంగారం, రూ.1.84 కోట్ల నగదు స్వాదీనం 

సాకక్షి, కర్నూలు: సినీ ఫక్కీలో ఒంటిపై చొక్కా లోపల ధరించిన బనియన్లలో భారీగా బంగారం, నగదు పెట్టుకుని దర్జాగా బస్సులో నిద్రిస్తున్న నలుగురిని పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.1,84,53,500 నగదు, 4.565 కిలోల బంగారం, 5కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ సురేష్  కుమార్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... అక్రమంగా బంగారం తరలిస్తున్నారని స్పెషల్‌ బ్రాంచ్‌ హెడ్‌ కానిస్టెబుల్‌ ఖాజాహుసేన్‌ సమాచారం ఇవ్వడంతో కర్నూలు జిల్లా అమకతాడు టోల్‌ప్లాజా వద్ద కృష్ణగిరి, వెల్దుర్తి ఎస్‌ఐలు ఎం.చంద్రశేఖర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి సీఐ గురువారం అర్ధరాత్రి వాహన తనిఖీ చేపట్టారు.

హైదరాబాద్‌ నుంచి కోయంబత్తూరుకు వెళ్తున్న ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ స్లీపర్‌ బస్సులో తనిఖీలు చేయగా, అమర్‌ప్రతాప్‌ పవార్‌(నంద్యాల), శబరి రాజన్‌(సేలం, తమిళనాడు), వెంకటేష్‌ రాహుల్‌(కోయంబత్తూరు), సెంథిల్‌కుమార్‌ (కోయంబత్తూరు) సినీ ఫక్కీలో బంగారం తరలిస్తున్నట్లు గుర్తించారు. వారు పథకం ప్రకారం తమ ఒంటిపై ధరించిన బనియన్‌కు పెద్ద జేబులు ఏర్పాటు చేసుకుని వాటిలో బంగారం, వెండి, నగదు పెట్టుకుని, దానిపై చొక్కా వేసుకుని ఎవరికీ అనుమానం రాకుండా ప్రయాణిస్తున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

అమర్‌ప్రతాప్‌ పవార్‌ నుంచి రూ.1,20,80,000, శబరి రాజన్‌ నుంచి 5 కిలోల వెండి బిస్కెట్లు, వెంకటేష్‌ రాహుల్‌ నుంచి 3.195 కిలోల బంగారం, రూ.19,23,500 నగదు, సెంథిల్‌కుమార్‌ నుంచి 1.37కిలోల బంగారం, రూ.44,50,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న బంగారం, వెండి విలువ రూ.2,74,54,800 ఉంటుంది. బంగారం, వెండి, నగదు తరలిస్తున్న వారి వద్ద ఎటువంటి పత్రాలు లేకపోవడంతో ఆర్‌ఐ మస్తాన్, వీఆర్వో గిడ్డయ్య ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి సీజ్‌ చేశారు.

నలుగురి నుంచి వివరాలు నమోదు చేసుకుని పంపించారు. కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్‌ శుక్రవారం ఉదయం సెట్‌ కాన్ఫరెన్స్‌లో స్పెషల్‌ బ్రాంచ్‌ హెడ్‌ కానిస్టెబుల్‌ ఖాజాహుసేన్‌తోపాటు తనిఖీల్లో పాల్గొన్న వెల్దుర్తి సర్కిల్‌ సిబ్బందిని అభినందించారు. కాగా, గత నెల 26న రాత్రి ఇదే టోల్‌ప్లాజా వద్ద హైదరాబాద్‌ నుంచి అనంతపురానికి వెళుతున్న ట్రావెల్స్‌ బస్సులో కూడా ఓ వ్యక్తి నుంచి రూ.43.20లక్షలు స్వాదీనం చేసుకున్నారు.  

whatsapp channel

మరిన్ని వార్తలు