అయ్యో భగవంతుడా.. పొట్ట కూటి కోసమని వెళ్తుంటే..

10 Sep, 2021 08:47 IST|Sakshi

తూత్తుకుడి ప్రమాదంలో నలుగురు మహిళలు మృతి

15 మందికి తీవ్ర గాయాలు 

సాక్షి, చెన్నై: పొట్ట కూటి కోసం వెళ్తున్న నలుగురు మహిళా కార్మికులను రోడ్డు ప్రమాదం కబళించింది. మరో 15 మంది గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.  తూత్తుకుడి జిల్లా ఒట్టపిడారంలోని ఓ పరిశ్రమ లో పుదియ ముత్తురు, నడువ కురిచ్చి, సిల్లంధం, ఉప్పిలి పట్టి పరిసర గ్రామాలకు చెందిన మహిళలు పనిచేస్తున్నారు. రోజూ మహిళల్ని ఇళ్ల వద్ద నుంచి ఆ పరిశ్రమకు చెందిన వాహనాల్లోనే తరలించడం జరుగుతోంది.

గురువారం ఉదయం ఐదారు వ్యాన్లలో వందమందికి పైగా మహిళలు విధులకు బయలుదేరారు. మార్గం మధ్యలో ఓ వాహనం ప్రమాదానికి గురైంది. తూత్తుకుడి నుంచి పుదియ ముత్తూరు వైపుగా వచ్చిన ట్యాంకర్‌ లారీని వ్యాన్‌ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ముందువైపుగా కూర్చుని ఉన్న సెల్వరాణి(45),  కుమారి అలియాస్‌ జ్యో తి(40), సత్య(48) ఘటనా స్థలంలోనే మరణించా రు. శిథిలాల్లో చిక్కుకున్న క్షతగాత్రుల్ని బయటకు తీసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. వీరిని ఆస్పత్రికి తరలించారు.ఇందులో పుదియముత్తురుకు చెందిన మణిమేఘలై(20) చికిత్స పొందుతూ మరణించారు. మరో పదిహేను మంది మహిళలు, డ్రైవర్‌ తీవ్ర గాయాలతో తూత్తుకుడి, ఒట్టపిడారం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

మరో ఘటనలో...

శుభకార్యానికి వెళ్లి వస్తూ.. మరో ముగ్గురు 
విరుదునగర్‌ జిల్లా శివకాశి సమీపంలోని నాచ్చియాపురానికి  చెందిన షణ్ముగ వేల్‌(55), మురుగేషన్‌ (53) అన్నదమ్ముళ్లు. తిరునల్వేలి జిల్లా కైత్తారులో బుధవారం జరిగిన బంధువుల ఇంటి శుభకార్యానికి కారులో కుటుంబంతో కలిసి వెళ్లారు. రాత్రి తిరుగు పయనంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆ కుటుంబానికి చెందిన షణ్ముగప్రియ(10), ఆవుడయమ్మాల్‌(50), ధనలక్ష్మి(52) ఘటనా స్థలంలోనే మరణించారు. షణ్ముగ వేల్, మురుగేషన్, ముత్తులక్ష్మి, రామలక్ష్మి తీవ్రంగా గాయపడి మదురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  

చదవండి: డైరీలో.. మమ్మీ నేను బతకడానికి వెళ్తున్నా, నా కోసం..

>
మరిన్ని వార్తలు