Chennai Crime: ప్రేమ వివాహం.. కొండపైకి తీసుకెళ్లి

29 Jan, 2023 13:41 IST|Sakshi

 వేలూరు(చెన్నై):  వేలూరు సమీపంలోని బాలమది కొండపై బండ రాళ్ల మధ్య గుర్తు తెలియని మహిళ మృతదేహం శుక్రవారం ఉదయం లభ్యమైన విషయం తెలిసిందే. బాగాయం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. హత్యకు గురైన మహిళ చిదంబరానికి చెందిన గుణప్రియ(20) అని తెలిసింది. దీంతో చిదంబరంలోని గుణప్రియ తల్లిదండ్రులకు సమాచారం అందజేయడంతో వారు వేలూరు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని గుర్తించారు. వేలూరుకు చెందిన పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ కుమారుడు కార్తీ(22)తో 8 నెలల క్రితం గుణప్రియకు ప్రేమ వివాహం జరిగిందని.. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో కార్తీ గుణప్రియను కొండపైకి తీసుకెళ్లి దాడి చేసి అక్కడి నుంచి తోసేసినట్లు తెలిసింది.

పోలీసులు కార్తీని అదుపులోకి తీసుకుని విచారించారు. గుణప్రియ చెన్నైలోని ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నట్లు ఇన్‌స్ట్రాగామ్‌ ద్వారా తనకు పరిచయమైందని తెలిపాడు. దీంతో తామిద్దరం 8 ఎనిమిది నెలల క్రితం కుటుంబ సభ్యులకు తెలియకుండా ప్రేమ వివాహం చేసుకున్నామన్నాడు. తమ కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో వేలూరులోని జీవా నగర్‌లో స్నేహితుడి ఇంటిలో అద్దెకు ఉన్నామని తెలిపాడు. ప్రస్తుతం గుణప్రియ ఆరు నెలల గర్భవతి అని.. ఈ విషయం తన ఇంట్లో చెప్పి తీసుకెళ్లాలని గొడవ పడేదని చెప్పాడు. దీంతో ఈనెల 25వ తేదీ బాలమది కొండపైకి వెళ్లామని.. అక్కడ కూడా ఘర్షణ జరిగిందని కోపంతో కర్రతో కొట్టడంతో మృతి చెందిందని వివరించాడు. చేసేది లేక కొండపై నుంచి మృతదేహాన్ని తోసి ఎవరికీ తెలియకుండా ఇంటికి వచ్చానని ఒప్పుకున్నాడు.

చదవండి: వీడియో: జాతీయ గీతం పాడుతూ వెకిలి చేష్టలు.. తప్పదు భారీ మూల్యం!

మరిన్ని వార్తలు