‘రూ.30 లక్షలు కట్టు.. గవర్నమెంట్‌ జాబ్‌ పక్కా’

6 Nov, 2021 15:46 IST|Sakshi

చెన్నై: ప్రభుత్వ ఉద్యోగానికి ఉండే క్రేజే వేరు. చిన్నదో, పెద్దదో ప్రభుత్వ ఉద్యోగం అయితే చాలు అనుకుంటారు. ఎందుకంటే ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగం వస్తే.. జీవితంలో సెటిల్‌ అయినట్లే. ఉద్యోగ భద్రత ఉంటుంది.. జీతం ఏటా పెరుగుతూనే ఉంటుంది. ప్రమోషన్‌కు డోకా ఉండదు. అందుకే యువతకు గవర్నమెంట్‌ జాబ్‌ అంటే అంత మోజు.

దీన్ని ఆసారా చేసుకుని.. క్యాష్‌ చేసుకునే మోసగాళ్లకు కొదవే లేదు. ప్రస్తుతం ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి తమిళనాడులో చోటు చేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగం ఇస్పిస్తానంటూ ఓ వ్యక్తి వద్ద నుంచి 30 లక్షల రూపాయలు వసూలు చేశాడు తమిళనాడుకు చెందిన ఓ కేటుగాడు. ఆ వివరాలు..
(చదవండి: నువ్వు సూపరహే.. 67 ఏళ్ల తర్వాత ఆ గ్రామంలో అద్భుతం)

నిందితుడిని కన్నణ్‌గా గుర్తించారు పోలీసులు. ఇతడు చెన్నై సెక్రటేరియట్‌ కాంప్లేక్స్‌లో అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో కన్నణ్‌కి ఓ కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా బాధితుడు రంగస్వామితో పరిచయం ఏర్పడింది. నాలుగేళ్లుగా తన కుమారుడికి ప్రభుత్వం ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు రంగస్వామి. 

విషయం తెలుసుకున్న కన్నణ్‌.. తాను సెక్రటేరియట్‌ కాంప్లెక్స్‌లోనే అసిస్టెంట్‌గా పని చేస్తున్నానని తెలిపాడు. రంగస్వామి కుమారుడి రెజ్యూమ్‌ ఇవ్వమన్నాడు. దాన్ని పరిశీలించి.. తనకు 30 లక్షల రూపాయలు ఇస్తే.. సెక్రటేరియట్‌లో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని తెలిపాడు. మొత్తం ఒకేసారి కాకుండా విడతల వారిగా కన్నణ్‌ అడిగిన మొత్తాన్ని అతడికి ఇచ్చాడు రంగస్వామి.
(చదవండి: పాపం అవినాష్‌.. కరోనాతో మరణించాక డీఎస్‌పీ కొలువొచ్చింది)

తీరా డబ్బు మొత్తం చెల్లించిన తర్వాత కూడా జాబ్‌ ఇప్పించకపోవడంతో.. రంగస్వామి, అతడి స్నేహితుడు కన్నణ్‌ని ప్రశ్నించారు.. తమ డబ్బులు వెనక్కి ఇచ్చేయమని అడిగారు. డబ్బులు ఇవ్వడానికి అంగీకరించలేదు కన్నణ్‌. ఈ క్రమంలో రంగస్వామి జరిగిన మోసం గురించి పోలీసులను ఆశ్రయించాడు. 

రంగస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. కన్నణ్‌ని అరెస్ట్‌ చేశారు. అతడు డబ్బులు తీసుకున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం కన్నణ్‌ జైలులో ఉన్నాడు. 

చదవండి: మారియప్పన్‌కు సర్కారీ ఉద్యోగం: సీఎం స్టాలిన్‌

మరిన్ని వార్తలు