అమ్మను అనాథను చేసి.. అమెరికా పయనమైన కుమారుడి అరెస్ట్‌!

26 Aug, 2022 23:00 IST|Sakshi

సాక్షి ప్రతినిధి,చెన్నై: నవమాసాలూ మోసి కనిపెంచిన తల్లి ఆ కుమారుడికి బరువైంది. భర్తను కోల్పోయి వృద్ధాప్యంలో ఒంటరిగా మిగిలిన తల్లిని వదిలేసి విదేశాలకు పారిపోతున్న కొడుకును పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై మైలాపూరుకు చెందిన దుర్గాంబాళ్‌ (74) ఈనెల 15న పోలీస్‌స్టేషన్‌లో తన కుమారుడిపై ఫిర్యాదు చేసింది. అందులో ‘నా భర్త కుప్పుస్వామితో కలిసి ఉండేదాన్ని. మాకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉంది. పెద్ద కుమారుడు రెండేళ్ల క్రితం మృతి చెందాడు. రెండో కుమారుడు రామకృష్ణన్‌ అమెరికాలో భార్యా బిడ్డలతో సకల సౌకర్యాలతో నివసిస్తున్నాడు.

నాభర్త కుప్పుస్వామి గతనెల 3న మరణించాడు. రెండో కుమారునికి తండ్రి మరణవార్త తెలిపినా అంత్యక్రియలు ముగిసిన తరువాత 10 రోజుల తరువాత చెన్నైలోని ఇంటికి వచ్చాడు. భర్త మరణించాడు, జీవనాధారం కోసం ఆర్థికంగా ఆదుకోవాలని కోరగా వీలుకాదని చెప్పాడు. వయసు మీదపడి భర్తను కోల్పోయిన స్థితిలో  తనకు సాయం చేసేందుకు నిరాకరించిన కుమారుడు రామకృష్ణన్‌పై తగిన చర్య తీసుకోవాలి’’ అని పేర్కొంది. సీనియర్‌ సిటిజన్స్‌ పర్యవేక్షణ చట్టం–2007 కింద పోలీసులు కేసు నమోదు చేసి, రామకృష్ణన్‌ విదేశానికి వెళ్లకుండా విమానాశ్రయానికి లుక్‌అవుట్‌ నోటీసు పంపారు.

ఇదిలా ఉండగా, ఈనెల 22వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు రామకృష్ణన్‌ గుట్టుచప్పుడు కాకుండా పోలీసుల కళ్లుకప్పి అమెరికా వెళ్లేందుకు విమానాశ్రయానికి చేరుకున్నాడు. అతడి పాస్‌పోర్టు తనిఖీ సమయంలో  ‘పోలీసులు వెతుకుతున్న నేరస్తుడి’గా విమానాశ్రయ కస్టమ్స్‌ అధికారులు గుర్తించి మైలాపూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మైలాపూరు పోలీసులు రామకృష్ణన్‌ను అరెస్ట్‌ చేశారు.

చదవండి: సీఎం బొమ్మై ఆర్ఎస్ఎస్ చేతిలో కీలుబొమ్మ.. రాష్ట్రంలో ప్రభుత్వం లేదు, పాలన లేదు

మరిన్ని వార్తలు