టీడీపీ నేత అజీజ్‌కు చెన్నై పోలీసుల నోటీసులు

27 Feb, 2022 09:45 IST|Sakshi

ఆయన తమ్ముడు, మరికొందరికి కూడా జారీ

చీటింగ్‌ కేసులో విచారణకు 28న హాజరుకావాలని ఆదేశాలు 

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు, నగర మాజీ మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌కు చెన్నై సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు ఈ నెల 28వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేశారు. ఆయన తమ్ముడు, మరికొందరికి కూడా జారీ అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. అబ్దుల్‌ అజీజ్, అతని సోదరుడు జలీల్, కుటుంబ సభ్యుల పేరిట స్టార్‌ ఆగ్రో మెరైన్‌ ఎక్స్‌పోర్ట్‌ కంపెనీ నిర్వహించేవారు. దీనికి విదేశాల్లోనూ బ్రాంచిలు ఉన్నాయి. కాగా, చెన్నైలోని టీనగర్‌కు చెందిన ప్రసాద్‌ జెంపెక్స్‌ కంపెనీ స్టార్‌ ఆగ్రో కంపెనీలో భాగస్వామ్యం కోసం రూ.42 కోట్లు పెట్టుబడులు పెట్టింది.

చదవండి: ‘బిగ్‌బాస్‌’ ఒక అనైతిక షో: సీపీఐ నారాయణ 

ఆ మొత్తాన్ని స్టార్‌ ఆగ్రో కంపెనీ డైరెక్టర్లుగా ఉన్న అజీజ్, అతని సోదరుడు అబ్దుల్‌ జలీల్‌ వారి వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించి మోసగించడంతో పాటు లెక్కలు చూపమని ప్రశ్నించిన తమ వారిపై బెదిరింపులకు దిగుతున్నారని జెంపెక్స్‌ కంపెనీ ప్రతినిధి  మనోహరప్రసాద్‌ తమిళనాడు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు 2017 డిసెంబర్‌లో చెన్నై సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ టీమ్‌–1, ఈడిఎఫ్‌–1 వింగ్‌ పోలీసులు అజీజ్, జలీల్, అబ్దుల్‌ ఖుద్దూస్‌తో పాటు పలువురిపై ఐపీసీ 406, 420, 506 (ఐ) ఆర్‌/డబ్ల్యూ 120 (బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

అప్పట్లో ఈ వ్యవహారం టీడీపీలో  కలకలం రేకెత్తించింది. అయితే తాను క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చాక డైరెక్టర్‌ పదవికి రాజీనామా చేశానని అబ్దుల్‌ అజీజ్‌  అప్పట్లో చెప్పారు. కేసు నుంచి తప్పించుకునేందుకు అలా చెప్పారనే విమర్శలు అప్పట్లో వెల్లువెత్తాయి.  పై కేసులో తదుపరి విచారణ నిమిత్తం హాజరుకావాలని సీసీబీ పోలీసు అధికారులు సెక్షన్‌ 41ఏ కింద శనివారం నోటీసులిచ్చారు. ఈ నెల 28 ఉదయం 10.30 గంటలకు అబ్దుల్‌ జలీల్, 12 గంటలకు అబ్దుల్‌ ఖుద్దూస్, మధ్యాహ్నం ఒంటిగంటకు అబ్దుల్‌ అజీజ్‌ హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు