ఎంత పనైపాయే.. స్కెచ్‌ ఒకరికి.. మర్డర్‌ మరొకరిని.. 

6 Sep, 2022 12:25 IST|Sakshi
అరెస్టయిన నిందితులు

సాక్షి, చెన్నై: తిరువళ్లూరు జిల్లాలోని ఊత్తుకోటలో అర్థరాత్రి యువకుడి హత్య కేసు కీలక మలుపు తిరిగింది. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రతీకార హత్యలో భాగంగా రౌడీషీటర్‌ను హత్య చేయడానికి ప్రణాళిక రచించి అతడి స్నేహితుడిని హత్య చేసినట్టు నిందితులు వాగ్మూలం ఇవ్వడంతో ఊత్తుకోట పోలీసులు షాక్‌ గురైయ్యారు. కాగా ఆగస్టు 31న ఊత్తుకోటలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన రాబిన్‌గా గుర్తించారు.

ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీటీవీ పుటేజీ ఆధారంగా విచారణ చేపట్టారు. హత్యలో నలుగురు యువకులు పాల్గొన్నట్టు నిర్ధారించిన తిరువళ్లూరు డీఎస్పీ చంద్రహాసన్‌ నేతృత్వంలో ఆరు విచారణ బృందాలతో గాలింపు చేపట్టి చోళవరానికి చెందిన కార్తీక్‌(26), శరవణన్‌(25), రాహుల్‌(25) ముగ్గరిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

బైక్‌పై రావడంతో..  
నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు హత్యకు గల కారణాలపై విచారణ ముమ్మరం చేశారు. ఇందులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హత్యకు గురైన రాబిన్‌ స్నేహితుడు మోహన్‌. ఇతనితో ప్రధాన నిందితుడిగా ఉన్న కార్తీక్‌ స్నేహితులు రెండు గ్రూపులుగా ఏర్పడి తరచూ ఘర్షణలకు దిగేవారు. గత రెండు నెలల క్రితం నాగపట్నం జిల్లా వేలాంగన్నికి చెందిన కార్తీక్‌ అనుచరుడు అభిషేక్‌ను మోహన్‌ వర్గీయులు హత్య చేశారు. ఈ హత్యకు ప్రతీకారంగానే మోహన్‌ను హత్య చేయడానికి నిర్ణయించి ప్రణాళిక రచించినట్టు పోలీసుల విచారణలో నిర్ధారించారు. 
చదవండి: బెడిసికొట్టిన ‘మద్యం చోరీ’ స్కెచ్‌.. పోలీసులకు చిక్కిన మందుబాబులు

సంఘటన జరిగిన రోజు మోహన్‌తో పాటు హత్యకు గురైన రాబిన్, కమల్‌తో సహా ఆరు మంది ఊత్తుకోటలో జరిగిన వివాహానికి హాజరైయ్యారు. వీరిలో కమల్, రాబిన్‌ రిషెప్షన్‌ ముగించుకుని ముందుగా బయలుదేరగా, మోహన్‌ మండపంలోని ఉండిపోయారు. ఈ నేపథ్యంలో ద్విచక్ర వాహనంలో బయలుదేరిన వ్యక్తి రౌడీషీటర్‌ మోహన్‌గా భావించిన ప్రత్యర్తులు వెంబడించి రాబిన్‌ను హత్య చేసినట్టు ఒప్పుకున్నారు. దీంతో ముగ్గరిని అరెస్టు చేసిన పోలీసులు ఊత్తుకోట కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.  

మరిన్ని వార్తలు