దద్దరిల్లిన దండకారణ్యం: 22 మంది జవాన్లు మృతి

4 Apr, 2021 15:27 IST|Sakshi

సాక్షి, చర్ల: భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులతో ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యం దద్దరిల్లింది. బీజాపూర్‌లోని తెర్రాం ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు 22 మంది జవాన్లు అమరులవగా, మరో 31 మంది జవాన్లకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఒక మహిళా మావోతో పాటు మొత్తం 15 మంది మావోయిస్టులు కూడా మృతి చెందినట్టు తెలిసింది. ఆదివారం కూడా ఇరు వర్గాల ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. అయితే, మరికొంతమంది జవాన్లు అదృశ్యమయ్యారనే వార్త కలకలం రేపుతోంది. ఈనేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసు అధికారులు చెప్తున్నారు. 

హెలికాప్టర్ల ద్వారా తరలింపు
ఎదురు కాల్పుల్లో మృతిచెందిన జవాన్లలో కోబ్రా దళానికి చెందిన ఒకరు, ఎస్టీఎఫ్ విభాగానికి చెందిన ఇద్దరు, డీఆర్జీ విభానికి చెందిన ఇద్దరు జవాన్లు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. గాయపడిన జవాన్లను హెలికాప్టర్ల ద్వారా  రాయ్పూర్, బీజాపూర్ ఆసుపత్రులకు తరలిస్తున్నామని పేర్కొన్నారు. కాల్పులు జరిగిన సమయంలో స్పాట్ లో ఉన్న 760మంది జవాన్లు ఉన్నట్టు తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియడానికి మరో ఆరుగంటలపైన సమయం పట్టే అవకాశం ఉందని అన్నారు. కాగా, ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌ ఘటనపై హోంమంత్రి అమిత్‌ షా ఆరా తీశారు. ఉన్నతాధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రధాని మోదీ, ఛత్తీస్ గఢ్‌ సీఏం అమర జవాన్ల మృతి పట్ల సంతాపం ప్రకటించారు.


 ( చదవండి: మరణంలోనూ వీడని స్నేహం.. )

మరిన్ని వార్తలు