మేనమామ చేతిలో చిన్నారి దారుణ హత్య

13 Jun, 2021 05:36 IST|Sakshi

విజయనగరం జిల్లాలో దారుణం  

గుమ్మలక్ష్మీపురం(కురుపాం): సొంత మేనమామ చేతిలో మూడేళ్ల చిన్నారి దారుణ హత్యకు గురైంది. తల్లి పక్కనే నిద్రిస్తున్నచిన్నారి గొంతు కోసి ప్రాణాలు తీశాడు. విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం లో జరిగిన ఈ ఘటన స్థానికులను ఆందోళనకు గురిచేసింది. పోలీసుల కథనం.. పెంగవ గ్రామానికి చెందిన కిల్లక పార్వతి తన మూడేళ్ల కూతురు భవ్యశ్రీతో కలిసి పుట్టింట్లో ఉంటోంది. శుక్రవారం రాత్రి ఎప్పటిలానే చిన్నారితో కలిసి నిద్రిస్తోంది. అదే గ్రామానికి చెందిన సొంత చిన్నాన్న కుమారుడు వినోద్‌.. రాత్రి 11 గంటల సమయంలో టార్చిలైట్‌ సాయంతో వారి వద్దకు వెళ్లి తల్లి పక్కనే పడుకున్న భవ్యశ్రీ మెడను కత్తితో కోశాడు.

భవ్యశ్రీ గిలగిలా కొట్టుకోవడంతో పార్వతికి మెలకువ వచ్చి చూసేసరికి వినోద్‌ పారిపోయాడు. రక్తం మడుగులో కొట్టుకుంటున్న చిన్నారిని చూసి తల్లి గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చారు. అప్పటికే చిన్నారి ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్‌ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. పార్వతిని భర్త వదిలేయడంతో అతని మీద కోపం పెంచుకున్న వినోద్‌ ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే వినోద్‌కు మతిస్థిమితం లేదని స్థానికులు చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు