ఛీ..ఛీ.. పాడుబుద్ధి.. వివాహేతర సంబంధాల మోజులో..

4 May, 2022 20:56 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కొందరు తల్లిదండ్రులు వక్రబుద్ధితో వివాహేతర సంబంధాలు నెరపుతున్నారు. ఆకర్షణకులోనై ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. కటకటాల్లోకి వెళ్తున్నారు. కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసుకుంటున్నారు. పిల్లలను అనాథులుగా మార్చుతున్నారు. కష్టాలకొలిమిలోకి నెట్టేస్తున్నారు. భవిష్యత్‌ను అంధకారంగా మార్చుతున్నారు. మేమేమి చేశాం పాపం అంటూ పిల్లలు గోడువెళ్లబోస్తున్నారు.  దీనికి ఇటీవల జిల్లాలో చోటుచేసుకున్న సంఘటనలే నిలువెత్తు నిదర్శనం.

విజయనగరం క్రైమ్‌: డెంకాడ మండలంలోని ఓ గ్రామానికి చెందిన భార్యాభర్తలు పదేళ్లుగా అన్యోన్యంగా జీవిస్తున్నారు. భార్య ఇటీవల ఓ ఫార్మాకంపెనీలో హెల్పర్‌గా చేరినప్పటి నుంచి ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం నెరపుతోంది. విషయం భర్తకు తెలిసింది. నిలదీయడంతో భర్తను హతమార్చేందుకు పూనుకుంది. ప్రియుడు, మరో వ్యక్తితో కలిసి మట్టుబెట్టింది. దీనిని ఆటో ప్రమాదంగా చిత్రీకరించింది. అనుమానం వచ్చిన పోలీసులు విచారణ జరపడంతో అసలు విషయాన్ని అంగీకరించింది. ఆమె జైలుకెళ్లింది. తండ్రి హత్యకు గురయ్యారు. వీరి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు అనాథులుగా మారారు.’

‘నెల్లిమర్ల మిమ్స్‌లో గుమస్తాగా పనిచేస్తున్న  భర్తను ప్రియుడి మోజులో పడిన భార్య మట్టుబెట్టేందుకు స్కెచ్‌ గీశారు. ప్రియుడు, అతని స్నేహితుడితో కలిసి హతమార్చారు. మృతదేహాన్ని రైలుపట్టాల మధ్యన పడేశారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసులో అల్లుడ్ని చంపేందుకు అత్త కూడా రూ.40వేలు కిరాయిలో తనవంతు రూ. 20వేలు ఇచ్చేందుకు సహకరించడం విశేషం. మృతునికి ఇద్దరు పిల్లలున్నారు. తల్లి, అమ్మమ్మ జైలు పాలయ్యారు. చిన్నవయసులోనే పిల్లల పరిస్థితిని
తలచుకున్నవారికి కన్నీరు ఉబుకుతోంది.’ 

వివాహేతర సంబంధాలు ఉసురు తీస్తున్నాయి. కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో హత్యలకు ప్రేరేపిస్తున్నాయి. అడ్డుతొలగించుకుంటే అంతా మనమేనన్న భ్రమను కల్పిస్తున్నాయి. చివరకు కుటుంబంలో ఒకరిని పొట్టనపెట్టుకుంటున్నాయి. పోలీసుల విచారణలో దొరికి, చివరకు జైలు గోడల మధ్యన నలిగిపోయేలా చేస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తయితే కడుపున పుట్టిన పదేళ్లలోపు చిన్నారులు అనాథలైపోతున్నారు.  ఆప్యాయంగా పిలవడానికి నాన్న ఉండడు. అన్నం పెట్టేందుకు అమ్మ దొరకదు. రక్తకన్నీరు కారుస్తూ, చిరుప్రాయంలోనే మనసులో బలమైన గాయాలు తగిలి, నలిగిపోతున్నారు. ఏం చేయాలో తెలియని స్ధితిలో నరకయాతన అనుభవిస్తున్నారు. వివాహేతర సంబంధాలు కుటుంబ బాంధవ్యాలను నాశనం చేస్తున్నాయి.  ఏకంగా ప్రాణాలు తీసేస్తున్న ఘటనలు జిల్లాలో వరసగా చోటుచేసుకోవడంతో జిల్లావాసులు ఉలిక్కిపడుతున్నారు. ఇటువంటి విషసంస్కృతికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కుటుంబాలను అనాథలను చేయకండి 
వివాహేతర సంబంధాల కారణంగా కుటుంబ వ్యవస్థ ఛిన్నాభిన్నమైపోతుందన్నది అందరికీ తెలిసిందే. తెలిసి తప్పుచేస్తే ఆ కుటుంబ పెద్దలపై ఆధారపడిన పిల్లలు, వృద్ధులు అనాథలైపోతారన్న విషయాన్ని గుర్తెరగాలి. వివాహేతర సంబంధాల పేరుతో హత్యలకు పాల్పడితే సహించేది లేదు. తీవ్రమైన చర్యలు ఉంటాయన్నది వాస్తవం. 
– ఎం.దీపిక, ఎస్పీ, విజయనగరం

ఇదొక మానసిక రుగ్మత 
వివాహేతర సంబంధాలు పెట్టుకోవడమనేది మానసిక రుగ్మత. చట్టబద్ధమైన వైవాహిక జీవితం మాత్రమే ఆచరించాలి. క్షణిక ఆకర్షణకు, విపరీత ధోరణుల వైపు మరలడం వల్ల వారి జీవితం పాడవ్వడమే కాకుండా, ఇరువురి కుటుంబాలు సమస్యల్లో చిక్కుకుంటాయి. సెల్, ఇంటర్‌నెట్‌ వాడకం పెరిగింది. కొత్త స్నేహాలు, అర్ధరాత్రుల వరకూ చాటింగ్‌లు, పరిచయాలు.. ప్రేమ ముసుగులో వివాహేతర సంబంధాలు చోటుచేసుకుంటున్నాయి. చివరకు కలిసి ఉండాల్సిన జీవితాలను కడతేర్చుకుంటున్నారు. చెడుస్నేహాలు, వ్యామోహాలు తగ్గించుకోవాలి. లేకుంటే కుటుంబం నడిసంద్రంలో నావలా తయారవుతుంది. 
– డాక్టర్‌ ఎన్‌వీఎస్‌ సూర్యనారాయణ, సైకాలజిస్టు, విజయనగరం   

మరిన్ని వార్తలు