మంటల్లో బాలుడి ఆహుతి..

27 Aug, 2021 21:01 IST|Sakshi

సాక్షి,గుంటూరు(రొంపిచర్ల): విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ వల్ల ఇంటికి నిప్పంటుకోవడంతో గదిలో నిద్రిస్తున్న అన్నదమ్ముల్లో ఒకరు మంటలకు ఆహుతయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం రాత్రి జరిగిన ఈ హృదయవిదారక ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. సంతగుడిపాడు గ్రామానికి చెందిన భువనగిరి ఏసు, దేవీ దంపతులు బతుకు తెరువుకోసం పిల్లలతో కలిసి హైదరాబాద్‌ వెళ్లారు. అక్కడే నివాసం ఉంటున్నారు. కొద్దిరోజుల క్రితం పాఠశాలలు తెరవడంతో వారి ఇద్దరు కుమారులు భువనగిరి లక్ష్మీప్రసన్న కుమార్, నాగేంద్రబాబు(12) స్వగ్రామానికి వచ్చారు. బుధవారం రాత్రి కుండపోతగా వర్షం కురవటంతో అన్నదమ్ములు తలుపులు వేసుకొని ఇంట్లో నిద్రపోయారు. ఆ సమయంలో విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ వల్ల మంటలు ఎగసిపడ్డాయి.

దీంతో ఇద్దరూ మంటల్లో చిక్కుకున్నారు. పెద్దపెట్టున కేకలు వేశారు. స్థానికులు వెంటనే స్పందించి మంటలు ఆర్పేందుకు యతి్నంచారు. దగ్గరలోని ట్రాన్స్‌ఫార్మర్‌ దగ్గరకు వెళ్లి విద్యుత్‌ సరఫరాను నిలుపుదల చేశారు. బలవంతంగా ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా నాగేంద్రబాబు కాలిపోయి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. లక్ష్మీప్రసన్నకుమార్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని 108 అంబులెన్స్‌ ద్వారా నరసరావుపేటలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అతడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు సమాచారం.

మంటలకు ఇంట్లోని దుస్తులు, పుస్తకాలు, విలువైన వస్తువులు, గృహోపకరణాలు కూడా దగ్ధమయ్యాయయి. ఎస్‌ఐ పి.హజరత్తయ్య ఘటనాస్థలాన్ని పరిశీలించారు. విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కాలనీ వాసులు ఆరోపించారు. ప్రమాద సమయంలో ఫోన్‌చేస్తే స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న చిన్నారుల తల్లిదండ్రులు హుటాహుటిన హైదరాబాద్‌ నుంచి వచ్చారు. ఒక కుమారుడు దుర్మరణం పాలవడం, మరో కుమారుడు మృత్యువుతో పోరాడుతుండడంతో గుండెలవిసేలా రోదించారు. నాగేంద్రబాబు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

చదవండి: రాహుల్‌ హత్య కేసు: వ్యాపార లావాదేవీలే కారణం

మరిన్ని వార్తలు