లోకం తెలియని చిన్నారులు.. రోజూ నరకమే.. అందుకే వచ్చేశాం..

30 May, 2022 15:28 IST|Sakshi
మస్తానీ - మౌలాలీ

సాక్షి, అమరావతి బ్యూరో: లోకం తెలియని చిన్నారులు వాళ్లు. తాగుబోతు నాన్న పెట్టే బాధలు భరించలేకపోయారు. రోజూ తాగి వచ్చి అమ్మను, తమను కొట్టడాన్ని తట్టుకోలేకపోయారు. ఇంకా అక్కడ ఉంటే తమకు రోజూ నరకమేనన్న భావనకొచ్చారు. ఎలాగోలా అక్కడ నుంచి బయట పడాలనుకున్నారు. ఏదో రైలెక్కి విజయవాడ వచ్చేశారు. రైల్వేస్టేషన్‌ ప్లాట్‌ఫాంపై దీనంగా ఉన్న వీరిని క్లీనింగ్‌ సిబ్బంది చూసి చైల్డ్‌లైన్‌ ప్రతినిధులకు అప్పగించారు.
చదవండి: ఇలా చేశావేంటి అలెగ్జాండర్‌.. యువతిని నమ్మించి.. మోసగించి.. మరో మహిళతో..

ప్రకాశం జిల్లా మార్కాపురంలోని వేంకటేశ్వరస్వామి గుడి ప్రాంతానికి చెందిన వీరు తమ పేర్లు మస్తానీ (9), మౌలాలీ (7) గా చెబుతున్నారు. తండ్రి ఎల్లప్ప కూలింగ్‌ నీళ్లు అమ్మే పని చేస్తుంటాడని, తల్లి శ్యామల కుర్చీలకు వైర్లు అల్లుతుందని అంటున్నారు. ‘నాన్న ఇంట్లో డబ్బులివ్వడు. ఇవ్వకపోగా రోజూ మందు (మద్యం) తాగడానికి అమ్మను డబ్బుల కోసం సతాయిస్తుంటాడు. ఇవ్వకపోతే కొడతాడు. ఇచ్చాక తాగి వచ్చాక అమ్మను, మమ్మల్ని కొడుతూ ఉంటాడు. అందుకే తమ్ముడు, నేను, ఇల్లు వదిలి నాన్నకు దూరంగా వచ్చేశాం. ఇక మార్కాపురం నాన్న దగ్గరకు వెళ్లం.’ అని మస్తానీ చెబుతోంది.

పోలీసులకు సమాచారం ఇచ్చాం
ఈ చిన్నారులు గురువారం సాయంత్రం 4.30 గంటల సమయంలో విజయవాడ రైల్వేస్టేషన్లో ఉండగా అక్కడ క్లీనింగ్‌ సిబ్బంది మాకు అప్పగించారు. వెంటనే మైక్‌లో అనౌన్స్‌మెంట్‌ చేయించాం. వారి కోసం ఎవరూ రాలేదు. తదుపరి సంరక్షణ కోసం జీఆర్‌పీ స్టేషన్లో హాజరు పరిచాం. చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ ఆదేశాలతో బాలుడిని విజయవాడ ఎస్‌కేసీవీ చి్రల్డన్‌ ట్రస్టు వసతి గృహంలోను, బాలికను ప్రజ్వల బాలికల వసతి గృహంలోనూ తాత్కాలికంగా ఉంచాం. పిల్లలు చెప్పిన వివరాలతో ప్రకాశం జిల్లా మార్కాపురం టౌన్‌ పోలీసులకు సమాచారం ఇచ్చాం.  
– కళ్లేపల్లి శ్రీకాంత్, కో–ఆర్డినేటర్, రైల్వే చైల్డ్‌లైన్, విజయవాడ  

మరిన్ని వార్తలు