టార్చర్‌ ఫ్రమ్‌ హోమ్‌!

1 Jun, 2022 08:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చైనా లోన్‌ యాప్స్‌ తరపున పని చేస్తూ రుణం తీసుకుని చెల్లించలేకపోయిన వారిని వివిధ రకాలుగా వేధిస్తున్న కాల్‌ సెంటర్లు ప్రస్తుతం వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానంలో పని చేస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్గావ్‌లో చేసిన దాడుల నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు పీటీ వారెంట్‌పై మంగళవారం నగరానికి తరలించారు.

చైనీయులు సూత్రధారులుగా ఏర్పాటైన సంస్థలు క్యాష్‌ అడ్వాన్స్, మనీ బాక్స్, అడ్వాన్స్‌ క్యాష్, లోన్‌ బజార్, క్యాష్‌ బస్‌ పేర్లతో లోన్‌ యాప్స్‌ నిర్వహిస్తున్నాయి. గూగుల్‌ ప్లే స్టోర్స్‌ నుంచి వీటిని డౌన్‌లోడ్‌ చేసుకున్న అనేక మంది రుణం తీసుకుంటున్నారు. వడ్డీ, సర్వీస్‌ చార్జీల భారం నేపథ్యంలో చెల్లించలేకపోయిన వారి నుంచి వసూలు చేయడానికి గుర్గావ్‌ కేంద్రంగా కాల్‌సెంటర్‌ ఏర్పాటైంది. అదే ప్రాంతానికి చెందిన హరిప్రీత్‌ సింగ్, పంకజ్‌ల నేతృత్వంలో ఇది నడుస్తోంది. గత ఏడాది డిసెంబర్‌లో ఢిల్లీలోని లోన్‌ యాప్స్‌ కాల్‌ సెంటర్లపై పోలీసులు దాడులు చేశారు.

దీంతో అప్పటి నుంచి వీరు తమ పంథా మార్చారు. గుర్గావ్‌లోని కాల్‌ సెంటర్‌ను మూసేశారు. తమ దందా కొనసాగించడం కోసం కొందరిని టీమ్‌ లీడర్లుగా ఎంపిక చేసుకుని వారి కింద 12 మందిని టెలీ కాలర్లుగా నియమించారు. ఇలా 15 బృందాలను ఏర్పాటు చేసిన హరి, పంకజ్‌లు టెలీకాలర్లకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అవకాశం ఇచ్చారు. టీమ్‌ లీడర్లు అందించే రుణగ్రస్తుల జాబితాల ఆధారంగా టెలీకాలర్లు వారి ఇంటి నుంచే ఫోన్లు చేసి, మార్ఫింగ్‌ ఫొటోలు పంపి వేధించేలా చేస్తున్నారు. క్యాష్‌ అడ్వాన్స్‌ యాప్‌ నుంచి రుణం తీసుకుని వేధింపులు ఎదుర్కొన్న బాధితుడి ఫిర్యాదుతో ఈ ఏడాది జనవరిలో సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో కేసు నమోదైంది. ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్‌ జి.వెంకట్రామిరెడ్డి దీనిని దర్యాప్తు చేశారు.

సాంకేతిక ఆధారాలను బట్టి నిందితులు గుర్గావ్, ఢిల్లీల్లో ఉన్నట్లు గుర్తించారు. ప్రత్యేక బృందంతో దాడులు చేసి గుర్గావ్‌లో టీమ్‌ లీడర్‌గా పని చేస్తున్న బీహార్‌ వాసి వికాస్‌ కుమార్, ఢిల్లీ, గుర్గావ్‌లకు చెందిన టెలీకాలర్లు శ్వేత, రాహుల్‌ రాణాలను అరెస్టు చేశారు. వీరిని స్థానిక కోర్టులో హాజరుపరిచి మంగళవారం సిటీకి తీసుకువచ్చి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. హరిప్రీత్‌ సింగ్, పంకజ్‌లతో పాటు మరో ఇద్దరు టీమ్‌ లీడర్లు అయిన దీపక్, సుమంత్‌లను ఇటీవల ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని కేసులోనూ వీరు నిందితులు కావడంతో కోర్టు అనుమతితో ఇక్కడకు తరలించాలని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నిర్ణయించారు.   

(చదవండి: యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నా ఆర్టీసీ...నడిరోడ్డే బస్‌బేలుగా..)

మరిన్ని వార్తలు