చినరాజప్ప ప్రధాన అనుచరుడు పల్లంరాజు అరెస్టు 

7 Jun, 2022 05:03 IST|Sakshi

అమలాపురం విధ్వంసం కేసులో అతనే ప్రధాన పాత్రధారి 

గంధం పల్లంరాజుతో పాటు 18 మందిని అరెస్టు చేసిన పోలీసులు 

సాక్షి, అమరావతి/అమలాపురం టౌన్‌: అమలాపురంలో విధ్వంసం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ప్రభుత్వ ఆస్తులు, మంత్రి, ఎమ్మెల్యే నివాసాలపై దాడులకు కీలక పాత్రధారిగా వ్యవహరించిన అమలాపురానికి చెందిన మాజీ రౌడీషీటర్, టీడీపీ నేత గంధం పల్లంరాజు, మరో ఇద్దరు రౌడీషీటర్లు గంప అనిల్, యాళ్ల నాగులతోపాటు 18 మందిని సోమవారం అరెస్టు చేశారు.

వారిలో సోషల్‌ మీడియా మాధ్యమాల ద్వారా విద్వేషాలు రెచ్చగొట్టి దాడులకు పురిగొల్పిన వారు కూడా ఉన్నారు. దాంతో ఈ కేసులో ఇప్పటివరకు 129 మందిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం అరెస్టు చేసిన 18 మంది నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచి రిమాండు కోసం జైలుకు తరలించినట్టు కోనసీమ జిల్లా ఎస్పీ కేఎస్‌ఎస్‌వీ సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. 

టీడీపీ పాత్ర బట్టబయలు 
గంధం పల్లంరాజు అరెస్టుతో ఈ కుట్ర కేసులో టీడీపీ పాత్ర మరోసారి బట్టబయలైంది. అతను టీడీపీ ప్రభుత్వంలో హోంమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ప్రధాన అనుచరుడు కావడం గమనార్హం. అతనిపై అమలాపురం, పరిసర ప్రాంతాల్లో పలు కేసులతో పాటు రౌడీషీట్‌ కూడా ఉండేది. గంధం పల్లంరాజుపై అమలాపురం స్టేషన్‌లో ఉన్న రౌడీ షీట్‌ను చినరాజప్ప హోంమంత్రిగా ఉన్న సమయంలోనే ఎత్తివేయడం గమనార్హం. గతంలో ఇసుక మాఫియా నడిపిన అతను అనంతరం రియల్టర్‌గా రూపాంతరం చెందాడు.

అమలాపురంలో గత నెల 24న చలో కలెక్టరేట్‌ ర్యాలీ సందర్భంగా అల్లర్లకు పన్నాగం వెనుక అతను క్రియాశీలకంగా వ్యవహరించాడు. రౌడీషీటర్లను అమలాపురం వీధుల్లో మాటువేసేలా చేయడంతోపాటు వారంతా ఒకేసారి ర్యాలీలోకి ప్రవేశించేలా స్కెచ్‌ను అమలు చేశాడు. అతనికి అమలాపురానికే చెందిన గంప అనిల్, కొత్తపేట మండలం మోడేకుర్రుకు చెందిన యాళ్ల నాగులు సహకరించారు.  

వాట్సాప్‌ గ్రూప్‌ల ద్వారా కుట్ర నడిపించారు.. 
వాట్సాప్‌ గ్రూపులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి మరీ విద్వేషాలు రెచ్చగొట్టడం, వాట్సాప్‌ గ్రూపుల ద్వారానే పోలీసుల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం అందించడం, ఏ సమయంలో దాడులకు పాల్పడాలో ఇలా మొత్తం కుట్రను పక్కాగా నడిపించారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ మేరకు వాట్సాప్‌ సందేశాలు, కాల్‌ డేటా, సీసీ టీవీ ఫుటేజీలను విశ్లేషించి పూర్తి ఆధారాలను సేకరించారు.

కాగా, ఈ కేసులో కుట్రదారులు, పాత్రధారులు మరికొందరి పాత్రపై పోలీసులు ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించినట్టు సమాచారం. వారిని కూడా త్వరలో అరెస్టు చేసే అవకాశాలున్నాయి. మరోవైపు అమలాపురంతోపాటు కోనసీమ అంతటా 144 సెక్షన్, పోలీసు సెక్షన్‌ 30లను పోలీసులు కొనసాగిస్తున్నారు.   

మరిన్ని వార్తలు