హవాలా లావాదేవీల్లో ఆరితేరిన లూ సాంగ్‌

12 Aug, 2020 16:12 IST|Sakshi

చైనీయుడి ఆగడాలకు ఢిల్లీ పోలీసుల చెక్‌

సాక్షి, న్యూఢిల్లీ : మనీల్యాండరింగ్‌తో పాటు హవాలా లావాదేవీల్లో నకిలీ చైనా కంపెనీల ప్రతినిధిగా అక్రమాలకు పాల్పడుతున్న చైనా దేశీయుడు లూ సాంగ్‌ను ఆదాయపన్ను శాఖ అధికారులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. కాగా గూఢచర్య ఆరోపణలపై 2018లో లూ సాంగ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేసినట్టు వెల్లడైంది. చార్లీ పెంగ్‌గా భారత్‌లో చెలామణి అవుతున్న లూ సాంగ్‌ను సెప్టెంబర్‌ 2018లో ఢిల్లీ పోలీస్‌ స్పెషల్‌ సెల్‌ అధికారులు గూఢచర్యం ఆరోపణలపై అరెస్ట్‌ చేశారు. చైనా తరపున నిందితుడు గూఢచర్యం సాగించడంతో పాటు మనీల్యాండరింగ్‌, హవాలా లావాదేవీలు నిర్వహిస్తున్నాడని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

భారత పాస్‌పోర్ట్‌ను సులభంగా సంపాదించవచ్చనే ఉద్దేశంతో నిందితుడు గతంలో మణిపురి యువతిని వివాహం చేసుకున్నాడని తెలిసింది. చార్లీ పెంగ్‌కు భారత్‌లో హవాలా లావాదేవీలు, మనీల్యాండరింగ్‌కు పాల్పడే క్రిమినల్‌ గ్యాంగులతో సంబంధం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు దేశంలో గుట్టుచప్పుడుగా మనీ ఎక్స్ఛేంజ్‌ సేవలను అందిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. విశ్వసనీయ సమాచారం అందడంతో ఐటీ అధికారులు ఢిల్లీ, ఘజియాబాద్‌, గురుగ్రామ్‌ సహా పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించిన క్రమంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, చైనా జాతీయులు 40కి పైగా బ్యాంకు ఖాతాలను సృష్టించి రూ 1000 కోట్లు పైగా వాటిలో జమచేశారని భావిస్తున్నారు. దేశంలో చైనా పెట్టుబడులపై కఠిన నిబంధనలు విధించి, 59 చైనా యాప్‌లను నిషేధించిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. చదవండి : చైనా ఎంట్రీతో ఇక అంతే..

మరిన్ని వార్తలు