చిట్టీల పేరుతో మోసం.. రూ.80 లక్షలకు టోకరా

27 Jul, 2021 08:48 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, నిజామాబాద్‌: చిట్టీల వ్యాపారంతో ఓ నిర్వాహకుడు రూ.80 లక్షలకు టోకరా వేశారు. తీరా పెట్టుబడి పెట్టి నష్టపోయానంటూ ఐపీపెట్టాడు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. డిచ్‌పల్లి మండలం ధర్మారంలో జరిగిన ఘటన. వివరాలు ఇలా ఉన్నాయి. ధర్మారం గ్రామానికి చెందిన సుమారు 50 మంది ప్రజలు అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వద్ద గత కొన్నినెలలుగా చిట్టీ నిర్వహిస్తున్నారు. ఒక్కొక్కరు చిట్టీల నిర్వహణలో రూ.5 లక్షల నుంచి రూ.10లక్షల వరకు డబ్బులు చెల్లించారు.

ఇలా కొన్ని నెలల పాటు బాధితులు డబ్బులు ఇవ్వడంతో నిర్వాహకుడి వద్ద సుమారు 80 లక్షల వరకు డబ్బులు జమఅయ్యాయి. దీంతో నిర్వాహకుడు సినీ పరిశ్రమలో పెట్టుబడులు పెట్టడంతో తీవ్రంగా నష్టపోయాడని తెలిసింది. అంతేకాకుండా ఐపీ పెట్టి కోర్టు నుంచినోటీసులు కూడా ఇప్పించాడు. దీంతో డబ్బులుకట్టిన బాధితులు ఆందోళన చెంది, గత రెండు రోజుల కిందట డిచ్‌ పల్లి పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. నిర్వాహకుడు కోర్టు నుంచి నోటీసులుఇచ్చాడని ఐపీ పెట్టాడని కోర్టులో తేల్చుకోవాలని స్థానిక పోలీసులు బాధితులకు తెలిపారు. దీంతో బాధితులు డబ్బులు ఇప్పించాలని సోమవారం పోలీసు కమిషనర్‌ కార్యాలయానికి తరలివచ్చారు. తమ డబ్బులు తమకు ఇప్పించాలని బాధితులుమొరపెట్టుకున్నారు. 

మరిన్ని వార్తలు