రాజకీయం చేయడం తగదు

8 Apr, 2021 04:05 IST|Sakshi
మాట్లాడుతున్న ఎస్పీ సెంథిల్‌కుమార్, పోలీస్‌ అధికారులు

విగ్రహాలు ధ్వంసం చేసింది మతిస్థిమితం లేని మహిళ  

ఫిర్యాదు అందిన 24 గంటల్లో ఛేదించాం 

చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్‌కుమార్‌

కుప్పం: చిత్తూరు జిల్లా కుప్పం మండలం గోనుగూరు పంచాయతీలో సుబ్రమణ్యస్వామి ఆలయంలో విగ్రహాల ధ్వంసం ఘటన సున్నితమైందని, దీన్ని రాజకీయ పారీ్టలు లబి్ధకోసం వాడుకోవడం తగదని చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్‌కుమార్‌ పేర్కొన్నారు. కుప్పంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఘటనపై మంగళవారం దేవస్థాన కమిటీ, పూజారులు ఫిర్యాదు చేయడంతో 24 గంటల్లోనే పోలీసుశాఖ ఛేదించిందని చెప్పారు. ఇది ఎలా జరిగింది, కారకులెవరు.. అనే సమాచారం తెలుసుకోకుండా ప్రతిపక్ష నేత చంద్రబాబు సైతం విమర్శలు చేయడం తగదన్నారు. ప్రజలను రెచ్చగొట్టే ప్రకటనల్ని రాజకీయ పారీ్టలు మానుకోవాలని సూచించారు. గోనుగూరు గ్రామంలో నాలుగేళ్లుగా మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న జ్యోతి అనే మహిళ సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాలను ధ్వంసం చేసి కొండ పక్కనున్న గుట్టలో పడేసిందని చెప్పారు.

గ్రామంలోని ఓ టీ దుకాణం వద్ద చేతికి గాయాలెందుకయ్యాయని కొందరు జ్యోతిని ప్రశ్నించగా.. మురుగన్‌ను చంపేశానని చెప్పినట్లు తెలిపారు. వారానికి ఒకసారి ఆలయంలో పూజలు చేసేందుకు వెళ్లే పూజారులు మూల విగ్రహాలు కనబడకపోవడంతో ఫిర్యాదు చేశారన్నారు. దీనిపై అదనపు ఎస్పీ రిషాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేశామని, ఆలయ కమిటీ, గ్రామస్తుల సహకారంతో 24 గంటల్లో ఛేదించామని చెప్పారు. జిల్లాలో 3,700 ఆలయాల్లో జియో ట్యాగింగ్‌ చేసి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, నిఘా పెంచామని తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసుశాఖ స్పందించి నిగ్గు తేల్చిందని, అసలు విషయం తెలుసుకోకుండా చంద్రబాబు సీబీఐతో విచారణ చేయాలని డిమాండ్‌ చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఈ సమావేశంలో డీఎస్పీ గంగయ్య, సీఐలు శ్రీధర్, యతీంద్ర, నాలుగు మండలాల ఎస్‌ఐలు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు