‘నారాయణ స్కూళ్లలో అడ్మిషన్లు పెంచేందుకే పేపర్‌ లీక్‌’

10 May, 2022 18:33 IST|Sakshi

సాక్షి, చిత్తూరు: నారాయణ స్కూళ్లలో అడ్మిషన్లు పెంచేందుకే పేపర్‌ లీక్‌ చేశారని చిత్తూరు ఎస్పీ రిశాంత్‌ రెడ్డి తెలిపారు. టెన్త్‌ క్వశ్చన్‌ పేపర్‌ లీక్‌ కేసులో మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణను మంగళవారం పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు చిత్తూరు ఎస్పీ మంగళవారం ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. 

ఉద్దేశపూర్వకంగానే పేపర్‌ను లీక్‌ చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు.  ఎస్పీ మాట్లాడుతూ.. ‘టెన్త్‌ పేపర్‌ లీక్‌ కేసులో నారాయణను అరెస్ట్‌ చేశాం.ఉదయం హైదరాబాద్‌లో నారాయణను అరెస్ట్‌ చేశాం. గత నెల 27న టెన్త్‌ పేపర్‌ మాల్‌ ప్రాక్టీస్‌ జరిగింది. చిత్తూరు పీఎస్‌లో నమోదైన కేసులో నారాయణను అరెస్ట్‌ చేశాం. 

నిందితుల చైన్‌ లింక్‌లో చైర్మన్‌ నారాయణ వరకు ఆధారాలు లభించాయి. నారాయణ స్కూళ్లలో అడ్మిషన్లు పెంచేందుకే పేపర్‌ లీక్‌. ఇన్విజిలేటర్ల వివరాలు ముందుగానే తీసుకుని మాల్‌ ప్రాక్టీస్‌.  వీరి దగ్గర చదివే విద్యార్థులను రెండు విభాగాలుగా విభజిస్తారు. ముందే ఏ విద్యార్థులు ఎక్కడ పరీక్ష రాస్తారో తెలుసుకుంటారు. హెడ్‌ ఆఫీస్‌ నుంచి వెంటనే కీ తయారు చేసి విద్యార్థులకు పంపుతారు. 

నారాయణతో పాటు తిరుపతి డీన్‌ బాల గంగాధర్‌ను అరెస్ట్‌ చేశాం. నిందితుల వాంగ్మూలం, టెక్నికల్‌ ఆధారాలతోనే నారాయణను అరెస్ట్‌ చేశాం. అరెస్ట్‌ అయిన వారంతా 2008 నుంచి నారాయణ విద్యాసంస్థల్లో పని చేసిన వారే. గత నెల 27న వాట్సాప్‌లో లీకయినట్లు ఫిర్యాదు వచ్చింది. గతంలో కూడా ఈ తరహా అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. నారాయణను కోర్టులో హాజరుపరుస్తాం’ అని ఎస్పీ రిశాంత్‌ తెలిపారు.

చదవండి👉పారిపోయే యత్నం చేసిన మాజీ మంత్రి నారాయణ!

మరిన్ని వార్తలు