సంక్షేమ పథకాలపై దుష్ప్రచారం.. సీఐడీ కేసు నమోదు

1 Jun, 2022 05:15 IST|Sakshi
సీఐడీ విచారణకు హాజరై తిరిగి వస్తున్న ఫేక్‌ పోస్టులు పెట్టిన నిందితులు

జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్‌ వాహన మిత్రపై దుష్ప్రచారం

ఈ రెండు పథకాలు నిలిపివేస్తున్నట్లు ఫేక్‌ పోస్టులు

సాక్షి, అమరావతి: జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్‌ వాహన మిత్ర పథకాలను ఈ ఏడాది నిలిపివేస్తున్నట్టు సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఫేక్‌ పోస్టులతో దుష్ప్రచారం చేసిన వారిలో ఇప్పటివరకు ఐదుగురిని గుర్తించి నోటీసులు జారీ చేశారు. కాగా వారిలో ముగ్గురిని సీఐడీ అధికారులు మంగళవారం విచారించారు. భారత జాతీయ చిహ్నం, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అధికారిక చిహ్నాలను ముద్రించి మరీ ప్రభుత్వ అధికారిక ప్రకటన విడుదల చేసినట్టుగా ఫేక్‌ పోస్టులు సృష్టించినట్టు సీఐడీ దృష్టికి వచ్చింది.

జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్‌ వాహన మిత్ర పథకాల లబ్ధిదారులను గందరగోళానికి గురిచేసి, ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకే ఈ పోస్టులు సృష్టించినట్లు విచారణలో వెల్లడైంది. దాంతో మంగళగిరిలోని సీఐడీ విభాగంలోని సైబర్‌ పోలీస్‌ స్టేషన్లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. భారత జాతీయ చిహ్నం, రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నాల దుర్వినియోగ నివారణ చట్టం, ఐటీ చట్టాల కింద కేసులు నమోదు చేసినట్టు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

ఆ ఫేక్‌ పోస్టులను వైరల్‌ చేసిన 12 సోషల్‌ మీడియా ఖాతాలను ఇప్పటివరకు గుర్తించారు. ఇప్పటివరకు గుర్తించిన ఐదుగురికి 41ఏ నోటీసులు జారీ చేశారు. వారిలో ముగ్గురు మంగళగిరిలోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పరుచూరి రమ్య, బాపట్ల జిల్లా వేమూరుకు చెందిన కోగంటి శ్రీనివాసరావు, పల్నాడు జిల్లా బుర్రిపాలేనికి చెందిన దాసరి కోటేశ్వరరావులను మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు విచారించారు.

అనంతరం వారిని విడిచిపెట్టారు. మళ్లీ విచారణకు పిలిస్తే రావల్సి ఉంటుందని చెప్పారు. నోటీసులు జారీ చేసినవారిలో మరో ఇద్దరు విచారణకు హాజరుకావల్సి ఉంది. కాగా మరికొన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిపివేస్తున్నట్టు దుష్ప్రచారం చేసిన మరికొందరిపై కూడా సీఐడీ అధికారులు దృష్టి సారించినట్టు తెలిసింది.  

మరిన్ని వార్తలు