‘నారా’యణ.. నల్లధనం ఓ ‘ఎన్‌స్పైర’!

11 Jan, 2023 04:13 IST|Sakshi
ఎన్‌స్పైర కార్యాలయంలో సీఐడీ సోదాల కారణంగా బయట హడావుడి

హైదరాబాద్‌లోని ఎన్‌స్పైర కార్యాలయంలో సీఐడీ తనిఖీలు.. హార్డ్‌ డిస్కులు, కీలక పత్రాలు స్వాదీనం

సాక్షి, అమరావతి: రాజధాని ముసుగులో టీడీపీ పెద్దలు రూ.వెయ్యి కోట్లకుపైగా నల్లధనాన్ని మళ్లించి 169.27 ఎకరాల అసైన్డ్‌ భూములను  సిబ్బంది, పని మనుషుల పేరుతో కాజేసిన బాగోతం బట్టబయలైంది. అమరావతిలో చంద్రబాబు సర్కారు అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులు ఈ కేసులో కీలక పురోగతి సాధించారు. టీడీపీ హయాంలో మొత్తం రూ.5,600 కోట్ల విలువైన 1,400 ఎకరాల అసైన్డ్‌ భూములను హస్తగతం చేసుకున్నట్లు ఇప్పటికే గుర్తించగా నల్లధనాన్ని  మళ్లిం­చేందుకు ‘ఎన్‌స్పైర’ అనే షెల్‌ కంపెనీని వాడు­కున్నట్లు తాజాగా తేలింది.

ఈ మేరకు హైదరాబాద్‌లోని ‘ఎన్‌స్పైర’ కార్యాలయంలో మంగళవారం విస్తృతంగా సోదాలు నిర్వహించిన సీఐడీ అధికారుల బృందం 45 హార్డ్‌ డిసు్కలు, బ్యాంకు ఖాతా లావాదేవీల కీలక పత్రాలను స్వాదీనం చేసుకుంది. గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న పొంగూరు నారాయణ తమ కుటుంబ వ్యాపార సంస్థ ‘ఎన్‌స్పైర’ ద్వారా సాగించిన అక్రమాల బాగోతం ఇలా ఉంది. 

కుమార్తె, అల్లుడు డైరెక్టర్లుగా.. 
మాజీ మంత్రి నారాయణ తమ కుటుంబం నిర్వహించే నారాయణ విద్యా సంస్థల కోసమంటూ ‘ఎన్‌స్పైర మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌’ అనే కంపెనీని ఏర్పాటు చేశారు. నారాయణ విద్యా సంస్థలకు సంబంధించి కొనుగోళ్లు, మౌలిక వసతుల కల్పన, ఉద్యోగులు, సిబ్బందికి జీతాల చెల్లింపుల కోసం దీన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

నారాయణ విద్యాసంస్థను లాభాపేక్షలేని సంస్థగా ఏపీ సొసైటీల చట్టం ప్రకారం ఏర్పాటుచేశారు. విద్యాసంస్థ నిధులను నారాయణ తమ వ్యక్తిగత, కుటుంబ అవసరాలకు మళ్లించేందుకు వీలులేదు. దీంతో నిధుల మళ్లింపు కోసం ఎత్తుగడ వేసిన నారాయణ తన కుమార్తె పొంగూరు సింధూర, అల్లుడు పునీత్‌ డైరెక్టర్లుగా ఎన్‌స్పైర అనే కంపెనీని నెలకొల్పారు.  

నల్లధనం భారీగా మళ్లింపు.. 
నారాయణ విద్యా సంస్థలకు అన్ని రకాల చెల్లింపులు నిర్వహిస్తున్నందుకు ఎన్‌స్పైరకు 10 శాతం కమిషన్‌ చెల్లిస్తున్నట్లు రికార్డుల్లో చూపారు. ఇదే అవకాశంగా ఎన్‌స్పైరలోకి ఇతర సంస్థల నుంచి భారీగా నిధులు మళ్లించారు. ఎన్‌స్పైరలో ఇతర కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టినట్లు చూపడం గమనార్హం. ఒలంపస్‌ క్యాపిటల్‌ ఏషియా క్రెడిట్‌ అండ్‌ సీఎక్స్‌ పార్టనర్స్‌ మ్యాగజైన్‌ అనే కంపెనీ 2016లో ఏకంగా రూ.400 కోట్లు పెట్టుబడి పెట్టినట్టు  చూపించారు.

ఇక 2018లో మోర్గాన్‌ స్టాన్లీ ప్రైవేట్‌ ఈక్విటీ ఏషియా, బన్యాన్‌ ట్రీ గ్రోత్‌ క్యాపిటల్‌ అనే సంస్థలు 75 మిలియన్‌ డాలర్లు (రూ.613.27 కోట్లు) పెట్టుబడి పెట్టినట్టు  రికార్డుల్లో చూపడం గమనార్హం. రెండు విడతల్లో ఎన్‌స్పైర కంపెనీలోకి రూ.1,013.27 కోట్లు వచ్చి చేరాయి. ఇలా భారీగా నల్లధనాన్ని ఎన్‌స్పైరలోకి మళ్లించినట్లు తెలుస్తోంది.  

ఆ నిధులు రామకృష్ణ హౌసింగ్‌లోకి.. 
వివిధ మార్గాల్లో ఎన్‌స్పైరలోకి మళ్లించిన నిధులను నారాయణ తమ సమీప బంధువైన కేవీపీ అంజనికుమార్‌ ఎండీగా ఉన్న రామకృష్ణ హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లోకి తరలించారు. దీంతోపాటు నారాయణ విద్యా సంస్థల సిబ్బంది బ్యాంకు ఖాతాల్లోకి కూడా నిధులు మళ్లించడం గమనార్హం. అనంతరం ఆ చిరుద్యోగుల పేరిట అమరావతిలో అసైన్డ్‌ భూము­లను కొనుగోలు చేశారు. తమ వద్ద పనిచేసే చిరుద్యోగులను బినామీలుగా మార్చుకుని 169.27 ఎకరాల అసైన్డ్‌ భూములను హస్తగతం చేసుకున్నారు.  

మొత్తం రూ.5,600 కోట్ల అసైన్డ్‌ దందా 
అమరావతిలో రూ.5,600 కోట్ల విలువైన 1,400 ఎకరాల అసైన్డ్‌ భూములను టీడీపీ పెద్దలు కొల్లగొట్టినట్లు సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. టీడీపీ హయాంలో పురపాలక శాఖ మంత్రిగా అమరావతి వ్యవహారాల్లో చక్రం తిప్పిన నారాయణ కనుసన్నల్లోనే భూ దందాలు జరిగాయి. రాజధాని కోసం సమీకరించే అసైన్డ్‌ భూములను గత ప్రభుత్వం ఎలాంటి పరిహారం చెల్లించకుండా తీసుకుంటుందని రెవెన్యూ, పురపాలక శాఖ అధికారుల ద్వారా ప్రచారం చేశారు.

ఇదే అదనుగా దళితులు, బీసీల భయాందోళనలను సొమ్ము చేసుకునేందుకు రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలను రంగంలోకి దించారు. అసైన్డ్‌ భూములను అయినకాడికి అమ్ముకోకుంటే ప్రభుత్వ పరమైపోతాయని పేదలను బెదిరించి కారుచౌకగా కాజేశారు. అసైన్డ్‌ భూములున్న వారికి నగదు చెల్లింపులు చేసి జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ (జీపీఏ) పొందారు. అనంతరం సేల్‌ డీడ్‌ల ద్వారా కథ నడిపించారు.

రిజిస్ట్రేషన్‌ చట్టం 22 ఏ కింద నిషేధిత భూముల జాబితాలో ఉన్న వీటిని పకడ్బందీగా సొంతం చేసుకున్నారు. ఆ విధంగా అమరావతి పరిధిలోని అనంతవరం, కృష్ణాయపాలెం, కురగల్లు, లింగాయపాలెం, మందడం, నెక్కల్లు, నవులూరు, రాయపూడి, తుళ్లూరు, ఉద్దండరాయునిపాలెం, వెంకటపాలెం, బోరుపాలెం, నేలపాడు, రాయపూడి తదితర గ్రామాల్లోని అసైన్డ్‌ భూములను టీడీపీ పెద్దలు కాజేశారు. అనంతరం అసైన్డ్‌ భూములకు గత ప్రభుత్వం తాపీగా ప్యాకేజీ ప్రకటించడం గమనార్హం. 

అక్రమాలు బహిర్గతం..
అసైన్డ్‌ భూములను హస్తగతం చేసుకున్న కేసులో మాజీ మంత్రి పి.నారాయణను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ అసైన్డ్‌ భూముల బదిలీ నిషేధిత చట్టం 1977, ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంతో పాటు ఐపీసీ 34, 35, 36, 37, 409, 420, 506 తదితర సెక్షన్ల కింద సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు. ఈ కుంభకోణంలో పాత్రధారులుగా వ్యవహరించిన నారాయణ సన్నిహితులైన ఐదుగురిని గతంలో అరెస్టు చేశారు. కాగా అసైన్డ్‌ భూములు కొల్లగొట్టేందుకు ఎన్‌స్పైర కంపెనీ ద్వారా నల్లధనాన్ని మళ్లించి అక్రమాల కథ నడిపించినట్లు సీఐడీ దర్యాప్తులో తాజాగా బహిర్గతమైంది. 

మరిన్ని వార్తలు