సీఎం సతీమణిపై తప్పుడు ప్రచారం ఐటీడీపీ పనే

2 Oct, 2022 04:40 IST|Sakshi

సూత్రధారి చింతకాయల విజయ్‌కు సీఐడీ నోటీసు

సాక్షి, అమరావతి/బంజారాహిల్స్‌ (హైదరాబాద్‌) : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్‌ భారతిపై సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న తప్పుడు ప్రచారం వెనుక పాత్రధారులు, సూత్రధారులను సీఐడీ గుర్తించింది. ‘భారతీపే’ అంటూ ఒక తప్పుడు వార్తను సృష్టించి సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్‌ చేస్తున్నది ఐటీడీపీ పనేనని సీఐడీ ప్రాథమిక విచారణలో నిర్ధారించింది.

చింతకాయల విజయ్‌ ఆధ్వర్యంలో ఐటీడీపీ నిర్వహిస్తున్నట్టు విచారణలో తేలింది. దీంతో క్రైం నెంబర్‌ 14/2022 ఐపీసీ సెక్షన్‌ 419, 469, 153–ఎ, 505(2), 120–బి రెడ్‌ విత్‌ 34, ఐటీ యాక్ట్‌–2000 సెక్షన్‌ 66(సి) ప్రకారం సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో దర్యాప్తునకు సహకరించాలంటూ చింతకాయల విజయ్‌కు సీఐడీ అధికారులు సెక్షన్‌ 41–ఎ నోటీసు ఇచ్చారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 3లోని ట్రెండ్‌సెట్‌ అపార్ట్‌మెంట్స్‌లో ఉన్న ఆయన నివాసంలో శనివారం ఉదయం సీఐడీ అధికారులు నోటీసును అందజేశారు. విజయ్‌ టీడీపీ సీనియర్‌ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి కుమారుడు.

నా మీద 14 కేసులు పెట్టి ఏం పీకారు : అయ్యన్నపాత్రుడు
నర్సీపట్నం: నా మీద 14 కేసులు పెట్టి ఏం పీకారని టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. తన కుమారుడు విజయ్‌ ఇంటికి సీఐడీ అధికారులు మఫ్టీలో వెళ్లి దౌర్జన్యం చేయటం సరికాదని శనివారం విడుదల చేసిన ఒక వీడియోలో చెప్పారు. ఆ వీడియోలో ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. సీఎం ఆలోచన మారాలన్నారు. ఏదో ఒక కేసు పెట్టి తమను జైల్లో పెట్టాలని ఈ ప్రభుత్వం చూస్తోందని అన్నారు.  

మరిన్ని వార్తలు