తుళ్లూరు మాజీ ఎమ్మార్వోపై సీఐడీ దర్యాప్తు జరగాల్సిందే

22 Oct, 2020 03:34 IST|Sakshi

హైకోర్టు ఉత్తర్వులు జారీ

ప్రాథమిక దశలో ఆపరాదని సుప్రీంకోర్టు ఎన్నోసార్లు చెప్పింది

తుళ్లూరు మాజీ తహసీల్దారుపై కేసులో తీవ్రమైన ఆరోపణలున్నాయని వ్యాఖ్య

సాక్షి, అమరావతి: అమరావతిలో అసైన్డ్‌ భూములను పట్టా భూములుగా మార్చడంతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన అసైన్డ్‌ భూములను టీడీపీ నేతలకు కట్టబెట్టడంలో కీలక పాత్ర పోషించిన అప్పటి తుళ్లూరు తహసీల్దార్‌ అన్నె సుదీర్‌బాబుపై సీఐడీ నమోదు చేసిన కేసులో దర్యాప్తు జరగాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తును ప్రాథమిక దశలోనే అడ్డుకోవడం, స్టే ఇవ్వడం లాంటివి చేయరాదని సుప్రీంకోర్టు పలుమార్లు స్పష్టంగా చెప్పిందని పేర్కొంది. ఈ వ్యవహారంలో సుదీర్‌బాబుపై తీవ్రమైన ఆరోపణలున్నాయని గుర్తు చేసింది. సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ అన్నె సుధీర్‌బాబు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్‌ బుధవారం ఉత్తర్వులిచ్చారు. సీఐడీ తరఫున పీపీ కె.శ్రీనివాసరెడ్డి, సుదీర్‌బాబు తరఫున దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు.  

పీపీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం.. 
పేదల అసైన్డ్‌ భూములను పట్టా భూములుగా మార్చడంలో సు«దీర్‌బాబు కీలక పాత్ర పోషించారని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాల్సిన అవసరం ఉందన్న శ్రీనివాసరెడ్డి వాదనతో కోర్టు ఏకీభవించింది. ఎస్సీ, ఎస్టీలను భూములు అమ్ముకునేలా చేసి ఇతరులకు లబ్ధి చేకూర్చడంలో సుదీర్‌బాబుదే కీలక పాత్ర అనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయన్న శ్రీనివాసరెడ్డి వాదనను కోర్టు పరిగణలోకి తీసుకుంది. పెద్ద మొత్తం చేతులు మారిందని, ఇందులో లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరముందన్న వాదనను పరిగణలోకి తీసుకుంది.  

మరిన్ని వార్తలు