పెద్ద సారు వద్దన్నా... దర్యాప్తునకు సిద్ధం

5 Dec, 2021 02:45 IST|Sakshi

‘సాక్షి’ కథనంతో బోధన్‌ స్కాంలో కదలిక

నిందితులకు త్వరలో సీఐడీ నోటీసులు

అవినీతి అధికారుల్లో గుబులు మొదలు

సాక్షి, హైదరాబాద్‌: ‘బోధన్‌’స్కాంపై సీఐడీ తదుపరి దర్యాప్తును ఓ ఉన్నతాధికారి అడ్డుకుంటున్న వైనాన్ని వివరిస్తూ ‘పెద్దసారు వద్దనే.. దర్యాప్తు ఆగేనే’పేరిట ‘సాక్షి’శుక్రవారం ప్రచురించిన కథనం అధికార వర్గాల్లో సంచలనం సృష్టించింది. బోధన్‌ వాణిజ్య పన్నుల శాఖలో 2005 నుంచి 2015 మధ్య జరిగిన రూ. 275 కోట్ల నకిలీ చలాన్ల కుంభకోణంలో కీలక నిందితులను అరెస్టు చేయరాదంటూ ఆ అధికారి హుకూం జారీ చేయడంతో నాలుగేళ్లుగా నిలిచిన దర్యాప్తులో ఎట్టకేలకు కదలిక వచ్చింది.

ఈ కేసులో నిందితులను ప్రశ్నించాకే చార్జిషీట్‌ వేస్తామని ఇంతకాలం దర్యాప్తుకు అడ్డుపడుతున్న ‘పెద్దసారు’కు సీఐడీ తేల్చిచెప్పినట్లు తెలిసింది. ఈ స్కాం బోధన్‌ సర్కిల్‌ కార్యాలయంలో జరిగినా దాని లింకులు హైదరాబాద్‌ కేంద్ర కార్యాలయం వరకూ ఉన్నట్లు సీఐడీ అధికారులు పోలీసు ఉన్నతాధికారులకు స్పష్టం చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా వాణిజ్య పన్నుల శాఖ అధికారుల పాత్రపై ఆధారాలున్నందున వారిని ప్రశ్నించేందు కు అనుమతివ్వాలని కోరినట్లు సమాచారం. 

తొలుత 8 మందికి తాఖీదులు? 
కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వివి ధ స్థాయిల్లోని 42 మంది అధికారులను ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్న సీఐడీ అధికారులు... తొలుత 8 మంది నిందితులకు తాఖీదులు జారీ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. ముగ్గురు అసిస్టెంట్‌ కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారులు (ఏసీటీవో), ఇద్దరు సూపరింటెండెంట్లు, ఇద్దరు డిప్యూటీ కమిషనర్లు, ఆడిటింగ్‌లోని ఓ అసిస్టెంట్‌ కమిషనర్‌ను విచారిం చేందుకు వారు సిద్ధమవుతున్నట్టు సమాచారం.

వారంతా బోధన్‌తోపాటు నిజామాబాద్‌ జిల్లాలో పనిచేసి తర్వాత కేంద్ర కార్యాలయానికి వచ్చినట్లు సీఐడీ గతంలోనే ధ్రువీకరించింది. ఈ కేసులో ప్రధా న నిందితుడిగా ఉన్న ట్యాక్స్‌ కన్సల్టెంట్‌ ఎస్‌ఎల్‌ శివరాజు కాల్‌డేటాలో వారి నంబర్లతోపాటు లావాదేవీల వివరాలు, సంబంధిత అధికారుల యూజర్‌ ఐడీలు, పాస్‌వర్డ్‌లు, ఉన్నట్లు గుర్తించింది. 

వణికిపోతున్న అధికారులు... 
ఈ కేసును తొక్కిపెట్టామని భావిస్తున్న నిందితులు సీఐడీ తాజా దూకుడుతో వణికిపోతున్నట్లు తెలిసింది. ఇన్నాళ్లూ పెద్ద దిక్కుగా ఉన్న ఓ మాజీ ఐఏఎస్‌ అధికారి వద్దకు వెళ్లి తమను కాపాడాలని ప్రాధేయపడ్డట్లు తెలియవచ్చింది. అయితే ఆయన నుంచి కూడా పెద్దగా హామీ రాకపోవడంతో ఏం చేయాలో తెలియక ఆందోళనలో పడ్డట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే బెయిల్‌పై వచ్చిన ఓ అధికారిని సంప్రదించి సీఐడీ అధికారులు ఏమేం ప్రశ్నలు అడిగారు.. అందుకు ఎలాంటి సమాధానాలు చెప్పావో తెలపాలని ఆరా తీసినట్లు తెలుస్తోంది.   

మరిన్ని వార్తలు