ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో టోకరా.. రూ.1.2కోట్లు స్వాహా

27 Mar, 2021 09:08 IST|Sakshi

నగర మహిళ నుంచి రూ.1.2 కోట్లు స్వాహా 

ఇద్దరిని అరెస్టు చేసిన సిటీ సైబర్‌ క్రైమ్‌ కాప్స్‌ 

సాక్షి, సిటీబ్యూరో: ఫేస్‌బుక్ ద్వారా ఎర వేసి, ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో పెట్టుబడి పెట్టించి, భారీ లాభమంటూ నమ్మబలికి నగర మహిళ నుంచి రూ.1.2 కోట్లు కాజేసిన ముఠాలో ఇద్దరు నిందితుల్ని సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశా రు. ఇరువురినీ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో పట్టుకున్నామని, పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నామ ని సంయుక్త పోలీసు కమిషనర్‌ అవినాష్‌ మహంతి తెలిపారు. నగరానికి చెందిన ఓ మహిళ వివరాలు తెలుసుకున్న సైబర్‌ నేరగాళ్లు ఫేస్‌బుక్‌ ద్వారా రిక్వెస్ట్‌ పంపారు. సాక్షి మెహతా పేరుతో వచ్చి దాన్ని ఈమె యాక్సెప్ట్‌ చేయడంతో ఇరువురి మధ్యా చాటింగ్స్‌ నడిచాయి. తాను ఢిల్లీలోని వసంత్‌ కుంజ్‌లో ఉన్న కంపెనీ సెంట్రల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌లో షేర్‌ ట్రేడింగ్‌ విభాగంలో కన్సల్టెంట్‌ అంటూ సాక్షి నమ్మబలికింది.

ఆపై బాధితురాలి ఫోన్‌ నంబర్‌ తీసుకుని పలుమార్లు మాట్లాడింది. ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ ద్వారా భారీ లాభా లు పొందవచ్చని చెప్పిన సాక్షి నగర మహిళతో డీమాట్‌ ఖాతాలు తెరిపించింది. ఆపై ప్రాథమికంగా రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టమని చెప్పిన సాక్షి ఆ మొత్తాన్ని తమ ఖాతాల్లో డిపాజిట్‌ చేయించుకుంది. కొన్ని రోజుల పాటు అందులో, ఇందులో ట్రేడింగ్‌ చేస్తున్నామని, భారీ లాభాలు వచ్చాయంటూ మాటలు చెప్పింది. ఓ రోజు కాల్‌ చేసిన ఆ కి‘లేడీ’ తమ వద్ద ఉన్న ట్రేడింగ్‌ ఖాతాలో ఉన్న మొత్తం రూ.4 కోట్లకు చేరిందని చెప్పింది. అది మీకు బదిలీ చేయాలంటే కంపెనీ నిబంధనల ప్రకారం ముందుగా తమకు రావాల్సిన బ్రోకరేజ్‌ చెల్లించాలని షరతు పెట్టింది. ఈ పేరుతో దాదాపు రూ.1.2 కోట్లు బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయించుకుని మోసం చేసింది.

ఈ మేరకు బాధితురాలు సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తు చేసిన ఇన్‌స్పెక్టర్‌ హరిభూషణ్‌ రావు నేతృత్వంలోని బృందం బ్యాంకు ఖాతాల వివరాలు, ఫోన్‌ నంబర్లను బట్టి ముందుకు వెళ్లింది. ఇలా భోపాల్‌కు చెందిన రాహుల్, మహేష్‌లు నిందితులని గుర్తించింది. అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందం ఇద్దరినీ అరెస్టు చేసి తీసుకువచ్చింది. ఈ ముఠాపై నగరంతో పాటు ఛత్తీస్‌గఢ్‌లో కలిపి మొత్తం మూడు కేసులు నమోదై ఉన్నట్లు గుర్తించారు.      

చదవండి: మైనర్లకు ‘ప్రేమ’ పాఠాలు.. ఆపై వీడియోలతో బెదిరింపులు

మరిన్ని వార్తలు