ప్రాణం తీసిన భూతగాదా..

4 Mar, 2021 07:58 IST|Sakshi

పత్తి చేనులోనే హత్య

హతుడు, నిందితులు సమీప బంధువులే

దహెగాం: భూవివాదంలో ఒకరు దారుణ హత్యకు గురైన సంఘటన దహెగాం మండలం ఖర్జీ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఒడెల హన్మంతు, ఒడెల మల్లేశ్‌ అన్నదమ్ములు. ఉమ్మడి కుటుంబంగా ఉన్నప్పుడు ఐదెకరాలు కొన్నారు. భూమిని పంచుకున్నా.. పట్టామాత్రం హన్మంతు పేరునే ఉంది. మల్లేష్‌ కొన్నేళ్లక్రితమే చనిపోగా.. అతడి కుమారులు సాగు చేసుకుంటున్నారు. ఆ భూమిని తమకు పట్టాచేసి ఇవ్వాలని హన్మంతును కోరుతున్నారు. అయితే భూమి కొన్న సమయంలో డబ్బులు ఖర్చయ్యాయని, చెల్లిస్తే పట్టా చేసి ఇస్తానని హన్మంతు అంటున్నాడు.

దీనిపై పలుమార్లు పంచాయితీ కూడా పెట్టారు. బుధవారం పత్తికట్టె తొలగించడానికి ట్రాక్టర్‌ తీసుకోని హన్మంతు కుమారుడు శంకర్‌ తన మేనత్త మధునక్కతో కలిసి చేనుకువెళ్లాడు. మధునక్క ఆమె సొంత చేనుకు వెళ్లగా శంకర్‌ ట్రాక్టర్‌ సహాయంతో కట్టెను తొలగిస్తున్నాడు. అదే సమయంలో మల్లేష్‌ కుమారులు సాయి, సంతోష్, సతీష్‌ వచ్చి అడ్డుకున్నారు. ట్రాక్టర్‌ను అడ్డుకోవడంతో డ్రైవర్‌ ట్రాక్టర్‌తోపాటు వెళ్లిపోయాడు. అయితే మాటమాట పెరగడంతో సాయి, సంతోష్, సతీశ్‌ కలిసి శంకర్‌పై కర్రలతో దాడికి దిగారు. మధునక్క పరుగెత్తుకుంటూ వెళ్లి అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. ఆమెకూ గాయాలయ్యాయి. కొద్దిదూరం పరుగెత్తుకుంటూ వెళ్లి ఫోన్‌ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది.

బంధువులు వచ్చిసరికే శంకర్‌ రక్తపుమడుగులో మృతిచెంది కనిపించాడు. విషయం తెలుసుకున్న ఏఎస్పీ వైవీఎస్‌.సుధీంద్ర, కాగజ్‌నగర్‌ రూరల్‌ సీఐ రాజేంద్రప్రసాద్, ఎస్సై రఘుపతి సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య పార్వతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రఘుపతి తెలిపారు. అయితే నిందితులు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం. 

చదవండి: పట్టపగలే బాలికపై లైంగిక దాడికి యత్నం!

మరిన్ని వార్తలు