నాటు తుపాకీతో స్కూల్‌కు వెళ్లి ఉపాధ్యాయుడిపై కాల్పులు.. వీడియో వైరల్‌

24 Sep, 2022 19:06 IST|Sakshi

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ సీతాపుర్‌ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. 10వ తరగతి విద్యార్థి తనకు పాఠాలు బోధించే ఉపాధ్యాయుడిపైనే కాల్పులకు తెగబడ్డాడు. నాటు తుపాకీతో స్కూల్‌కి వెళ్లి టీచర్‌పై మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. అయితే అదృష్టవశాత్తు బుల్లెట్ కీలకమైన అవయవాలకు తగలకపోవడం వల్ల ఉపాధ్యాయుడు ప్రాణాలతో బయటపడ్డాడు. 

తనపై కాల్పులు జరిపిన విదార్థిని టీచర్‌ ధైర్యంగా ప్రతిఘటించిన దృశ్యాల సీసీటీవీలో నమోదయ్యాయి. ఈ ఘటన చూసి పాఠశాలలోని కొందరు విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. మరికొంత మంది విద్యార్థులు మాత్రం ఉపాధ్యాయుడి వద్దకు చేరుకున్నారు. కాల్పులు జరిపిన విద్యార్థిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు.

తన తోటి విద్యార్థితో గొడవపడినందుకు ఈ విద్యార్థిని టీచర్ మందలించినట్లు తెలుస్తోంది. దీంతో ఆగ్రహం చెందిన అతడు పగ పెంచుకుని ఉపాధ్యాయుడిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు అదనపు ఎస్పీ రాజీవ్ దీక్షిత్ చెప్పారు. వైద్యుల సూచన మేరకు ఉపాధ్యాయుడ్ని లక్నో ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.


చదవండి: 21 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు ఇంకా టచ్‌లోనే ఉన్నారు

మరిన్ని వార్తలు