తమిళనాడులో మరో ఘోరం.. పాఠశాల హాస్టల్‌లో 12వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య

25 Jul, 2022 15:49 IST|Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడు సేలం జిల్లాలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఉపాధ్యాయుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న ఘటన మరిచిపోకముందే రాష్ట్రంలో మరో ఘోరం వెలుగు చూసింది. తిరువళ్లూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో 12 వతరగతి చదవుతున్న మరో విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. 10 రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో రెండు ఘటనలు చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. 

టెక్కులూరుకు చెందిన 17 ఏళ్ల విద్యార్థిని తిరువళ్లూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో 12 వతరగతి చదవుతోంది. సోమవారం రాత్రి తోటి విద్యార్థులతో కలిసి భోజనం చేసి హాస్టల్‌ గదిలోలో పడుకుంది. సోమవారం ఉదయం మిగతా బాలికలు పాఠశాలకు వెళ్లగా.. తాను ఆలస్యంగా వస్తానని స్నేహితులకు చెప్పింది. అయితే విద్యార్థిని ఎంతకు పాఠశాలకు రాకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది హాస్టల్ గదికి వెళ్లి చూడగా విద్యార్థిని సీలింగ్‌కు ఉరివేసుకొని శవమై కనిపించింది.

విషయం తెలుసుకున్న బాధితురాలి కుటంబ సభ్యులు, బంధువులు హుటాహుటిన హాస్టల్‌ వద్దకు చేరుకొని స్టూల్‌ యాజమాన్యానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. సరైన సమయంలో తమకు సమాచారం ఇవ్వలేదని, తమ కూతురు మృతికి యాజమాన్యమే బాధ్యత వహించాలంటూ తిరుత్తణి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. బాధిత కుటుంబ సభ్యలు ఆందోళనలతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

శాంతిభద్రతలు పరిరక్షించేందుకు పోలీసు బలగాలు మోహరించాయి. ఘటనపై మప్పేడు పోలీస్‌ స్టేషన్‌లోకేసు నమోదు చేయగా.. కేసును సెంట్రల్‌ బ్రాంచ్‌-సీఐడీ అధికారులకు బదిలీ చేశారు. అధికారులు విచారణ నిమిత్తం పాఠశాలకు చేరుకున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో యాజమాన్యం పాఠశాలకు సెలవు ప్రకటించింది.
చదవండి: కి‘లేడీ’లు!.. ఏసీబీ అధికారులంటూ జ్యువెలరీ షాప్‌లోకెళ్లి..

>
మరిన్ని వార్తలు