సీఎం కార్యదర్శి ఆత్మహత్యాయత్నం

28 Nov, 2020 10:44 IST|Sakshi
సీఎం యడ్యూరప్పతో రాజాకీయ కార్యదర్శి ఎన్‌ఆర్‌ సంతోష్‌ కుమార్‌ (ఫైల్‌ ఫొటో)

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజాకీయ కార్యదర్శి ఎన్‌ఆర్‌ సంతోష్‌ కుమార్‌ శుక్రవారం ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. తన నివాసంలో నిద్ర మాత్రలు వేసుకొని అపస్మారక స్థితిలో కనిపించారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే సంతోష్‌ కుమార్‌ను స్థానిక ఎంఎస్‌ రామయ్య ఆస్పత్రికి తరలించారు. భర్త ఆత్మహత్య యత్నంపై ఆయన భార్య జాహ్నవి మీడియాతో మాట్లాడుతూ.. ‘ నా భర్త సంతోష్‌ కుమార్‌ శుక్రవారం సాయంత్రం చాలా ఆందోళనతో పాటు, బాధగా కనిపించారు. సాయంత్రం 7గంటల సమయంలో ఆయన ఇంటి మేడపైకి వెళ్లారు. నేను డిన్నర్‌కు‌ ఏం వండాలో అడుగుదామని మేడపైకి వెళ్లాను. అప్పటికే ఆయన స్పృహ కోల్పోయి అపస్మారక స్థితిలో ఉన్నారు.  పక్కనే నిద్ర మాత్రలు కనిపించాయి. దీంతో వెంటనే స్థానిక అస్పత్రిలో  చేర్చాం’ అని ఆమె తెలిపారు. తమ కుటుంబం చాలా సంతోషంగా ఉందని, తమకు ఎలాంటి సమస్యలు లేవని జాహ్నవి వెల్లడించారు. చదవండి: అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం

ఈ ఘటనపై ముఖ్యమంత్రి  యడ్యూరప్ప  స్పందిస్తూ.. ‘అతను ఎందుకు అలా ఆత్మహత్యకు యత్నించాడో తెలియదు. సంతోష్‌కు సరైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించాన’ని తెలిపారు. అలాగే సంతోష్‌ కుమార్‌ కుటుంబ సభ్యులతో కూడా ముఖ్యమంత్రి మాట్లాడి, వారికి ధైర్యం చెప్పారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా సంతోష్‌ కుమార్‌ తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నట్లు సమాచారం. ఆయన ఈ ఏడాది ప్రారంభంలో ముఖ్యమంత్రికి రాజకీయ కార్యదర్శిగా నియమితులైన విషయం తెలిసిందే. అయితే సంతోష్‌ కుమార్‌ ఆత్మహత్య యత్నానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ‘ప్రియురాలి’ కోసం కొడుకుని చంపిన తల్లి

మరిన్ని వార్తలు