సీఎం యోగిని చంపేస్తానని వచ్చిన బెదిరింపు కాల్‌లో ప్రేమకోణం..

25 Apr, 2023 19:12 IST|Sakshi

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తానని బెదిరింపు కాల్ రావడం కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో ప్రేమ కోణం ఉన్నట్లు విచారణలో తేలింది. తాను ప్రేమించిన యువతి తండ్రిపై కోపంతో ఓ యువకుడు అతని ఫోన్ దొంగిలించి సీఎంకు చంపేస్తానని కాల్ చేశాడని పోలీసులు తెలిపారు. ప్రేయసి తండ్రిని తప్పుడు కేసులో ఇరికించి జైలుకు పంపాలని పథకం పని యువకుడు ఈ పని చేసినట్లు వెల్లడించారు. అతడిపై ఫోన్ చోరీ కేసు కూడా నమోదు చేశారు. నిందితుడ్ని 18 ఏళ్ల అమీన్‌గా గుర్తించారు.

ఏం జరిగిందంటే..?
మంగళవారం ఉదయం 112 నంబర్కు ఫోన్ చేసిన ఓ వ్యక్తి సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తానని బెదిరింపు కాల్ చేశాడు. యూపీ పోలీసుల హెల్ప్ లైన్ వాట్సాప్‌ నంబర్‌కు కూడా ఈ సందేశాన్ని పంపాడు. దీంతో అప్రమత్తమైనా పోలీసులు ఆ నంబర్‌ను ట్రేస్ చేశారు. లక్నోలో ఉంటున్నాడని తెలిసి వెంటనే అతని వద్దకు చేరుకున్నారు. అయితే తన ఫోన్‌ను రెండు రోజుల క్రితమే ఎవరో దొంగిలించారని, ఈ కాల్ తాను చేయలేదని సజ్జాద్‌ హుస్సేన్ పోలీసులకు చెప్పాడు. దీంతో పొరుగింటి వారిని పోలీసులు వాకబు చేశారు. అప్పుడే అమీన్ గురించి వాళ్లు చెప్పారు. హుస్సేన్‌ను ఇరికేందుకు అతడే ఈ పని చేసి ఉంటాడని పేర్కొన్నారు. 

వెంటనే పోలీసులు అమీన్‌ వద్దకు చేరుకుని అరెస్టు చేశారు. హుస్సేన్ కూతుర్ని తాను ప్రేమించానని, ఆయన తమ ప్రేమకు ఒప్పుకోలేదనే ఇలా చేసినట్లు విచారణలో తెలిపాడు. హుస్సేన్‌పై ప్రతీకారంతోనే ఫోన్ దొంగిలించి సీఎం యోగిని చంపేస్తానని బెదిరింపు కాల్ చేసినట్లు అంగీకరించాడు.
చదవండి: షిండేకు ఊహించని షాకిచ్చిన బీజేపీ.. సీఎంగా తప్పుకోవాలని హుకుం.. కొత్త ముఖ్యమంత్రి ఎవరంటే..?

మరిన్ని వార్తలు