ఖతర్నాక్‌ యువతి.. సహాయం చేయమంటే..

13 Dec, 2020 13:05 IST|Sakshi

న్యూఢిల్లీ : సహాయం కోరిన ఓ వృద్ధురాలిని దారుణంగా మోసం చేసిందో యువతి. నమ్మకంగా ఉంటూ ఆమె వద్దనుంచి లక్షల రూపాయలు దోచేసింది. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో శనివారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఢిల్లీలోని నెహ్రూ విహార్‌కు చెందిన ఓ వృద్ధురాలికి తన ఫోన్‌లో‌ నగదు లావాదేవీలు చేయటం తెలియదు. దీంతో నగదు లావాదేవీల కోసం ఇంటి పక్కనే ఉండే కాలేజీ అమ్మాయి సహాయం తీసుకుంది. నవంబర్‌ నెలలో మొదటిసారి కొత్త ఏటీఎం కార్డు పొందిన వృద్ధురాలు పిన్‌ నెంబర్‌ జెనరేషన్‌ కోసం యువతి సహాయం కోరింది. పిన్‌ జెనరేషన్‌లో సహాయపడ్డ ఆ యువతి, డెబిట్‌ కార్డు వివరాలతో ఈ వ్యాలెట్‌కు దాన్ని జతచేయటంలోనూ సహాయపడింది. ( పీహెచ్‌డీ చదివి ఈజీ మనీ కోసం..)

ఇలా అన్ని వివరాలు తెలుసుకున్న ఆమె వృద్ధురాలి బ్యాంకు ఖాతాలోని నగదును కొద్దికొద్దిగా తన ఖాతాకు బదిలీ చేసుకునేది. ఓటీపీని, డబ్బులు విత్‌డ్రా చేసుకున్నారని వచ్చే మెసేజీలను ఫోన్‌ నుంచి తొలగించేది. అలా దోచుకున్న నగదుతో  బట్టలు, ఇంటి అవసరమైన సామాన్లు, మొబైల్‌ రీచార్జులు చేసుకునేది. నవంబర్‌ 2019 నుంచి మార్చి 2020 వరకు 2,38,00 రూపాయలు కొట్టేసింది. తల్లి ఖాతాలోంచి నగదు పోతోందని గుర్తించిన ఆమె కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కాలేజీ అమ్మాయిని అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు