దారుణం: పట్టపగలు అందరూ చూస్తుండగా శ్వేతను చంపేశాడు

24 Sep, 2021 21:22 IST|Sakshi
శ్వేత, రామచంద్రన్‌ (ఫైల్‌)

తాంబరం రైల్వే స్టేషన్‌లో ఘటన 

సాక్షి, చెన్నై: ప్రేమోన్మాదానికి గురువారం చెన్నైలో మరో యువతి బలైంది. తనను ప్రేమించడం లేదన్న ఆగ్రహంతో పట్టపగలు అందరూ చూస్తుండగానే ఆమె మీద ఉన్మాది దాడి చేసి.. గొంతు భాగంలో పలుమార్లు కత్తితో పొడిచాడు. ఆపై తానూ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. తాంబరం రైల్వే స్టేషన్‌ ఆవరణలో సాయంత్రం మూడు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఇతర ప్రయాణికులు రక్తపు మడుగులో ప్రాణాలతో కొట్టు మిట్టాడుతున్న ఆ ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు.  

ప్రేమించ లేదన్న ఆగ్రహంతోనే.. 
క్రోంపేట జీహెచ్‌ ఆస్పత్రిలో చికిత్స ఫలించక కాసేపటికి ఆ యువతి  మరణించింది. మెరుగైన చికిత్స నిమిత్తం ఉన్మాదిని రాజీవ్‌గాంధీ జీహెచ్‌కు తరలించారు. ఆ యువతి ఐడీకార్డు ఆధారంగా క్రోంపేటకు చెందిన శ్వేతగా గుర్తించారు. ఆ యువకుడి పేరు రామచంద్రన్‌గా తేలింది. క్రోంపేటలో ఉంటున్న శ్వేత.. తాంబరం రైల్వే స్టేషన్‌కు కూతవేటు దూరంలోని ఎంసీసీ కళాశాలలో మెడికల్‌ ల్యాబ్‌ టెక్నిషియన్‌ కోర్సు రెండో సంవత్సరం చదువుతోంది. కొంతకాలంగా రామచంద్రన్‌ ప్రేమ ప్రేరిట శ్వేతను వేధిస్తున్నట్లు సహచర విద్యార్థినులు పోలీసుల దృష్టికి తెచ్చారు.  చదవండి:  (అత్యాచారం చేసి పదో అంతస్తు నుంచి తోసేశాడు)

అలాగే, రైల్వేస్టేషన్‌ పరిసరాల్లోని సీసీ కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇక, ఆస్పత్రిలో స్పృహలోకి వచ్చిన రామచంద్రన్‌ను విచారించగా, తామిద్దరం ప్రేమికులుగా పేర్కొనడం గమనార్హం. నాగపట్నంకు చెందిన రామచంద్రన్‌ చెన్నై శివారులోని ఓ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. 2019లో నాగపట్నం నుంచి వస్తుండగా శ్వేతతో తనకు రైలులో పరిచయం ఏర్పడినట్లు వెల్లడించాడు. హఠాత్తుగా తనను దూరం పెట్టడంతోనే ఈ ఘాతకానికి పాల్పడినట్లు రామచంద్రన్‌ వాంగ్ములం ఇచ్చాడు. కాగా, గతంలో నుంగంబాక్కం రైల్వే స్టేషన్‌లో స్వాతి అనే టెక్కిని ఇదే రకంగా ఓ ప్రేమోన్మాది నరికి చంపిన విషయం తెలిసిందే.

చదవండి: (వందల కోట్ల రూపాయల ఆస్తి.. వృద్ధుల కిడ్నాప్‌)

మరిన్ని వార్తలు