Gujarat Grishma Vekariya News: అరేయ్‌.. దాని గొంతు కోసేస్తా, నేనూ విషం తాగేస్తా రా!

22 Feb, 2022 21:32 IST|Sakshi

ప్రేమోన్మాదం.. ఎలాంటి ఘాతుకాలకు దారితీస్తుందో చూస్తూనే ఉన్నాం. కానీ, కన్నతల్లి నిస్సహయంగా రోదిస్తుంటే.. ఒక ఆడబిడ్డ రాలిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పడం కష్టం. గుజరాత్‌లో సంచలనం సృష్టించిన గ్రీష్మా వెకారియా(21) హత్యోదంతంలో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. సోషల్‌ మీడియా వైరల్‌ అయిన ఈ వీడియో తల్లిదండ్రుల్లో భయాన్ని రేకెత్తిస్తోంది.

ఫిబ్రవరి 12న కామ్రేజ్‌ పసోదరా ప్రాంతంలోని గ్రీష్మను ఆమె ఇంటికి వెళ్లి మరీ గొంతు కోసి చంపాడు ఫెనిల్‌ గొయాని. ఆ సమయంలో తల్లి, ఆమె బంధువులు కాపాడే యత్నం చేసినప్పటికీ.. వాళ్ల పైనా ఫెనిల్‌ దాడి చేశాడు. ఇక చుట్టుపక్కల కొందరు చూస్తూ.. వీడియోలు తీస్తూ ఉండిపోయారే తప్ప, ధైర్యం చేసి గ్రీష్మను కాపాడే యత్నం చేయలేకపోయారు. ఆపై ఆ అమ్మాయి గొంతు కోసేసి.. పాన్‌ నములుతూ ఎవరూ దగ్గరి రాకుండా బెదరించాడు ఫెనిల్‌. ఘటన జరిగిన నాలుగు రోజులకు నిందితుడిని అరెస్ట్‌ చేశారు పోలీసులు.   

భద్రతపై భయాలు
గ్రీష్మ హత్యోదంతం గుజరాత్‌ను వణికించింది. పట్టపగలు.. అదీ అందరూ చూస్తుండగానే అతి కిరాతకంగా గ్రీష్మను చంపడం, వెనక ఉన్న కొందరు అడ్డుకునేందుకు అవకాశం ఉన్నా.. ఆ దిశగా ఎవరూ సాహసం చేయకపోవడంపై సమాజం తీరును ప్రశ్నించింది. ఇక ఈ కేసులో సూరత్‌ పోలీసులు.. 2500 పేజీల ఛార్జ్‌షీట్‌ను కేసు తీవ్రత దృష్ట్యా తొమ్మిది రోజుల్లోనే రూపొందించి.. ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ ముందు సమర్పించారు. ఇందుకోసం మొత్తం 190 మంది సాక్షుల్ని, 25 మంది ప్రత్యక్ష సాక్షుల్ని ప్రశ్నించారు పోలీసులు. 

దొంగతనం.. ఏకే 47 కోసం.. 
ఇదిలా ఉండగా.. నిందితుడు ఫెనిల్ ఈ-కామర్స్‌ పోర్టల్‌లో హత్యకు ఉపయోగించిన కత్తిని కొనుగోలు చేశాడు. అంతకు ముందు ఇంటర్నెట్‌లో ఏకే 47 కోనుగోలుకు సంబంధించి సెర్చ్‌ చేసినట్లు హిస్టరీ ద్వారా పోలీసులు నిర్ధారించుకున్నారు.  ఫెనిల్‌ గోయాని.. పక్కా చిచ్చోర్‌గాడు. తాగి గ్యాంగ్‌ వార్‌లలో జోక్యం చేసుకునేవాడు. గతంలో ఓ కారు దొంగతనం కేసులో అరెస్ట్‌ అయ్యాడు కూడా. గ్రీష్మతో కలిసి చదువుకున్నప్పటికీ.. తర్వాత అటెండెన్స్‌ లేక డిబార్‌ అయ్యాడు. గ్రీష్మను తరచూ ప్రేమించమని, పెళ్లి చేసుకోమని వేధిస్తూ పోయాడు. చివరికి.. విషయం గ్రీష్మ ఇంట్లో వాళ్లకు చెప్పడంతో వాళ్లు ఫిర్యాదు దాకా వెళ్లారు. తమ కొడుకు మళ్లీ గ్రీష్మ జోలికి రాడని ఫెనిల్‌ పేరెంట్స్‌ మాట ఇవ్వడంతో గ్రీష్మ ఇంట్లో వాళ్లు వెనక్కి తగ్గారు. ఆపై మళ్లీ ఆమె కాలేజీకి వెళ్లి వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె సీరియస్‌ వార్నింగ్‌ ఇవ్వగా, ఆమె బంధువులు సైతం బెదిరించారు. ఆ కోపంతోనే పాపం గ్రీష్మను బలితీసుకున్నాడు.


   
విషం తాగేస్తా అంటూ.. 
ఇక గ్రీష్మను హత్య చేశాక.. నిందితుడు ఫెనిల్‌ కూడా ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు కథనాలు వచ్చాయి. కానీ, అది నిజం కాదని పోలీసులు స్పష్టం చేశారు. గ్రీష్మ ప్రాణం పోయేదాకా ఎవరినీ దగ్గరి రాకుండా కత్తితో బెదిరించాడని పోలీసులు తెలిపారు. ఆపై గాయపర్చుకుని డ్రామాలాడనని తెలిపారు. అయితే ఘాతుకానికి ముందు.. స్నేహితులతో మాట్లాడిన ఆడియో క్లిప్‌ను మాత్రం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో అవతలి వాడితో గ్రీష్మను గొంతుకోసి చంపేయాలనుకుంటున్నానని, ఆపై తాను విషం తాగి అక్కడే చనిపోతానని చెప్పినట్లు ఉందట. అయితే హత్యకు ముందు నలుగురు స్నేహితులతో కలిసి చర్చించిన ఫెనిల్‌.. తాను చావకూడదని ఫిక్స్‌ అయ్యాడు. ఘటన తర్వాత తనతో వచ్చిన ఆ నలుగురు తలొదిక్కు పారిపోయారు. 


‘‘మహిళల భద్రతకు కృషి చేస్తున్నట్లు ప్రభుత్వం ఎలా చెప్పుకుంటోంది. నా కూతురు అమాయకురాలు. ఆమె ఏ తప్పు చేయలేదు. అయినా హత్య చేశారు. నాకు న్యాయం కావాలి. నా కళ్లెదుటే నా కూతురు గొంతుకోశాడు. రక్తం ధారలుగా పారింది. ఇదంతా నా కళ్ల ముందే జరిగింది. దేశంలోని ఏ ఆడపిల్లకు కూడా గ్రీష్మ గతి పట్టకూడదు. అమ్మాయిలకు రక్షణ ఏది? రాష్ట్ర ప్రభుత్వం తగిన భద్రతను కల్పిస్తేనే రాష్ట్రంలోని అమ్మాయిలు భద్రంగా ఉంటారు’’.
                                                                                                                                                                                      : విలాస్ వెకారియా, గ్రీష్మ తల్లి

మరిన్ని వార్తలు