ఢిల్లీ అల్లర్లు: సల్మాన్‌ ఖుర్షీద్‌కు షాక్‌..!

24 Sep, 2020 14:22 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఈశాన్య ప్రాంతంలో చెలరేగిన అల్లర్ల కేసులో పోలీసులు ఇప్పటికే చార్జిషీట్‌ నమోదు చేసిన విషయం తెలిసిందే. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్నార్సీకి వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి అల్లర్లకు ప్రేరేపించారనే ఆరోపణలతో ఇప్పటికే పలువురి పేర్లను అభియోగ పత్రంలో చేర్చారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఎం నాయకురాలు బృందా కారత్‌, న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ సమా ఆర్థికవేత్త జయతి ఘోష్, ఢిల్లీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అపూర్వానంద్, స్వరాజ్ అభియాన్ నాయకుడు యోగేంద్ర యాదవ్ తదితరుల పేర్లు ఇందులో ఉన్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ పేరును చార్జిషీట్‌లో చేర్చిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. (చదవండి: ఢిల్లీ అల్లర్లు : అరెస్టుల ప్రక్రియ షూరూ)

ఇందులో భాగంగా, సుమారు 17 వేల పేజీలతో సెప్టెంబరు 13న నమోదు చేసిన చార్జిషీట్‌లో.. ‘‘ఉమర్‌ ఖలీద్‌, సల్మాన్‌ ఖుర్షీద్‌, నదీం ఖాన్‌.. వంటి నాయకులు యాంటీ సీఏఏ- ఎన్సార్సీ ఉద్యమాల్లో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి ప్రజలను ప్రేరేపించారు’’ అని ఓ సాక్షి వాంగ్మూలం ఇచ్చినట్లుగా ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. హింస చెలరేగేలా కుట్రలు పన్నిన కోర్‌టీంలో సదరు సాక్షి కీలకంగా వ్యవహరించినట్లు పేర్కొన్నారు. సీఆర్‌పీసీలోని సెక్షన్‌ 164 ప్రకారం మెజిస్ట్రేట్‌ ఎదుట ఈ మేరకు వాంగ్మూలం నమోదు చేసినట్లు తెలిపారు. సదరు సాక్షితో పాటు మరో నిందితుడు కూడా సల్మాన్‌ పేరును ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. అయితే ప్రసంగంలో వ్యాఖ్యానించిన విషయాల గురించి మాత్రం ఎక్కడా వెల్లడించలేదు.

ఇక ఈ విషయంపై స్పందించిన సల్మాన్‌ ఖుర్షీద్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మీరు చెత్తను సేకరించాలనుకుంటే చాలా మలినాలు దొరుకుతాయి. ఎవరో ఒక వ్యక్తి ఇచ్చిన స్టేటమెంట్‌ను నిరూపించేందుకు ఈ చెత్తను జతచేస్తారు. నిజానికి ఆ రెచ్చగొట్టే ప్రసంగం ఏమిటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. చెత్త సేకరించే వాళ్లు తమ పనిని సరిగ్గా చేయలేకపోతున్నారు అనిపిస్తోంది’’అంటూ విమర్శలు గుప్పించారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 23-26 మధ్య ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో 53 మంది ప్రాణాలు కోల్పోయారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా