ఉపాధ్యాయుడితో వివాహేతర సంబంధం.. భర్త హత్యకు కుట్ర

13 Aug, 2022 10:12 IST|Sakshi
నేరస్తుల కాల్పులకు ఉపయోగించిన తపాకీ చూపుతున్న ఎస్పీ 

ఊకొండి కాల్పుల ఘటనలో విస్తుపోయే విషయాలు.. 

9 మంది అరెస్ట్‌ 

కేసు వివరాలు వెల్లడించిన నల్లగొండ ఎస్పీ

సాక్షి, నల్లగొండ క్రైం: నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని ఊకొండి చౌరస్తా వద్ద ఈ నెల 4న నిమ్మల లింగస్వామిపై కాల్పులు జరిపిన ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. లింగస్వామి భార్య, ఆమె ప్రియుడు కలిసి అతడిని అంతమొందించేందుకు ప్లాన్‌ వేశారు. ఈ ఘటనలో పోలీసులు 9 మంది నిందితులను అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి తుపాకి, మ్యాగజైన్, 9 ఫోన్లు, రూ.4,500 నగదు, ప్రామిసరి నోట్, పాస్‌బుక్‌ స్వాధీనం చేసుకున్నారు.

శుక్రవారం నల్లగొండ జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ రెమారాజేశ్వరి వివరాలు వెల్లడించారు. నార్కట్‌పల్లి మండలం బి.వెల్లెంల గ్రామంలోని హైస్కూల్‌ ఉపాధ్యాయుడు చింతపల్లి బాలకృష్ణ అదే స్కూల్లో ‘మధ్యాహ్నం భోజనం’కార్మికురాలు నిమ్మల సంధ్యతో చనువుగా మెలుగుతున్నాడు. తనను పెళ్లి చేసుకుంటే పొలం రాసి ఇవ్వడంతోపాటు డబ్బులు ఇస్తానని బాలకృష్ణ ఆమెకు ఆశ చూపాడు. ఇద్దరూ కలిసి సంధ్య భర్త లింగస్వామిని హత్య చేయించాలని పథకం వేశారు.  

మొదటి హత్యాయత్నం విఫలం 
లింగస్వామిని హత్య చేసేందుకు రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్‌కు చెందిన కనుక రామస్వామి, నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం వింజమూరు గ్రామానికి చెందిన పోల్‌ గిరిబాబు, యాచారం మండలం మాల్‌కు చెందిన రత్నాల వెంకటేశ్, బి.వెల్లంల గ్రామానికి చెందిన మహ్మద్‌ మొయినొద్దీన్‌లను బాలకృష్ణ సంప్రదించాడు. హత్యకు రూ.3 లక్షల సుపారీని వారికి ఇచ్చాడు. అయితే నెల రోజులు గడిచినప్పటికీ లింగస్వామిని హత్య చేయకపోవడంతో తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని బాలకృష్ణ వారిపై ఒత్తిడి చేశాడు. దీంతో వారు ప్రామిసరీ నోట్, బ్యాంకు చెక్‌బుక్‌లు బాలకృష్ణకు ఇచ్చారు. 

చదవండి: (సివిల్స్‌ కోచింగ్‌ కోసం వచ్చి.. జల్సాల మత్తులో ‘లక్ష్యం చెదిరింది’)

హైదరాబాద్‌ గ్యాంగ్‌తో ఒప్పందం 
హైదరాబాద్‌లోని వనస్థలిపురం ఎఫ్‌సీఐ కాలనీలో ప్లంబర్‌గా పనిచేసే యూసుఫ్‌ను బాలకృష్ణ కలసి విషయం చెప్పాడు. దీంతో యూసుఫ్‌ తనకు పరిచయస్తులైన హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్‌ రెహమాన్, మహ్మద్‌ జహంగీర్‌ పాష అలియాస్‌ బాబు, ఏపీలోని చిలుకలూరిపేటకు చెందిన పఠాన్‌ ఆసిఫ్‌ఖాన్‌లతో కలసి రూ.12 లక్షలకు సుపారీ మాట్లాడుకున్నాడు. ఈ మేరకు బాలకృష్ణ రూ.5 లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించాడు. ఇందులో రూ.లక్ష నిమ్మల సంధ్య మహిళాసంఘంలో డబ్బులు తీసుకొని బాలకృష్ణకు అందజేసింది. 

బిహార్‌లో తుపాకీ కొనుగోలు ...  
అబ్దుల్‌ రెహమాన్‌ తుపాకిని బిహార్‌లో, ఓ పాత బైక్‌ను హైదరాబాద్‌లో కొనుగోలు చేశాడు. మునుగోడులో వాటర్‌ బాటిల్‌ డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేస్తున్న సంధ్య భర్త నిమ్మల లింగస్వామి బైక్‌పై వెళ్తుండగా ఊకొండి వద్ద ఈ నెల 4న సాయంత్రం యూసుఫ్‌ గ్యాంగ్‌ తుపాకితో మూడు రౌండ్లు కాల్పులు జరిపింది. వెంటనే కిందపడిపోయిన లింగస్వామిని చుట్టుపక్కలవారు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతోపాటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం లింగస్వామి చికిత్స పొందుతున్నాడు.  

నేరస్తుల అరెస్టు  
వివిధ ప్రాంతాల్లో ఉన్న పదిమంది నిందితుల్లో 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. బాలకృష్ణ, సంధ్య, అబ్దుల్‌ రెహమాన్, మహ్మద్‌ జహంగీర్‌ పాష అలియాస్‌ బాబు, పఠాన్‌ ఆసిఫ్‌ఖాన్‌ అరెస్టు కాగా మరో నిందితుడైన మహ్మద్‌ యూసుఫ్‌ పరారీలో ఉన్నాడు. కనుక రామస్వామి, రత్నాల వెంకటేష్, పోల్‌ గిరిబాబు, మహ్మద్‌ మోయినొద్దీన్‌లను కూడా అరెస్టు చేశారు. తుపాకీ ఎక్కడ కొనుగోలు చేశారనే విషయమై ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఎస్పీ వెల్లడించారు. శిక్షల నుంచి తప్పించుకోకుండా అన్ని శాస్త్రీయ ఆధారాలను సేకరిస్తున్నట్లు చెప్పారు.  

చదవండి: (పెళ్లి చేయడం లేదని నాన్న, చిన్నాన్నల హత్య)

మరిన్ని వార్తలు