వివేకా హత్యకేసులో ఆయుధాల కోసం కొనసాగిన గాలింపు

9 Aug, 2021 03:41 IST|Sakshi
ఆయుధాల కోసం వంకలో గాలిస్తున్న మునిసిపల్‌ పారిశుధ్య కార్మికులు

వంకలో జల్లెడపడుతున్న సీబీఐ బృందం 

ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో పలువురి విచారణ

పులివెందుల: మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్యకేసులో ఆయుధాల కోసం వైఎస్సార్‌ జిల్లా పులివెందులలోని తూర్పు ఆంజనేయస్వామి ఆలయ సమీపంలోగల వంకలో రెండోరోజు ఆదివారం కూడా సీబీఐ అధికారులు గాలించారు. కస్టడీలో ఉన్న సునీల్‌యాదవ్‌ తెలిపిన వివరాల మేరకు హత్యకేసుకు ఉపయోగించిన ఆయుధాల కోసం శనివారం గాలించిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం 6 గంటలకు కడప నుంచి సునీల్‌యాదవ్‌ సహా సీబీఐ అధికారులు వంక బ్రిడ్జి వద్దకు చేరుకుని మునిసిపల్‌ పారిశుధ్య కార్మికులతో ఆయుధాలకోసం గాలింపు చర్యలు చేపట్టారు. వంకలో బురద ఎక్కువగా ఉండటంతో ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం జేసీబీ వాహనాన్ని తెప్పించి బురదను తొలగించే కార్యక్రమం చేపట్టారు. కడప రైల్వేస్టేషన్‌ మేనేజర్‌ మోహన్‌రెడ్డి సాక్ష్యంగా చేపట్టిన ఈ గాలింపులో సాయంత్రం 6 గంటల వరకు ఎలాంటి ఆయుధాలు లభించలేదు. దీంతో అధికారులు వెనుదిరిగారు. సోమవారం మళ్లీ గాలించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.  

సీబీఐ బృందంతో సమావేశమైన వివేకా కుమార్తె, అల్లుడు 
ఆదివారం సాయంత్రం స్థానిక ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఉన్న సీబీఐ బృందాన్ని వైఎస్‌ వివేకా కుమార్తె సునీతమ్మ, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి కలిశారు. గంటకుపైగా సమావేశమైన వారు హత్యకేసుకు సంబంధించి పలు విషయాలు చర్చించినట్లు సమాచారం. మరోవైపు ఈ హత్యకేసుకు సంబంధించి సీబీఐ అధికారులు వైఎస్‌ వివేకా వంటమనిషి లక్షుమ్మ కుమారుడు ప్రకాష్, కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఇనయతుల్లా, యూసీఐఎల్‌ ఉద్యోగి ఉదయ్‌కుమార్‌రెడ్డి, కాంపౌండర్‌ ప్రకాష్‌రెడ్డి, వాచ్‌మెన్‌ రంగయ్యలను విచారించారు.   

మరిన్ని వార్తలు