‘శ్రీలక్ష్మి’ నీ మహిమలూ..!  తప్పు అధికారులది.. శిక్ష కొనుగోలుదారులకు 

9 Dec, 2021 10:34 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్‌: ఉద్యోగ విరమణ అనంతరం వచ్చిన సొమ్ముతో ఓ వ్యక్తి విల్లా కొనాలనుకున్నాడు. మల్లంపేటలో ఓ ప్రాజెక్ట్‌ను చూశాడు. నిర్మాణ అనుమతులు ఉన్నాయా లేదా పరిశీలించాడు. బ్యాంక్‌ రుణం వస్తుందా అని ఆరా తీశాడు. తక్కువ ధర, నచ్చిన చోటు కావటంతో కొనుగోలు చేసేశాడు. రిజిస్ట్రేషన్‌ కూడా పూర్తయింది. బ్యాంక్‌కు రెండు ఈఎంఐలు కూడా చెల్లించేశాడు.

ఇక గృహ ప్రవేశం చేయడమే తరువాయి! కానీ అకస్మాత్తుగా మున్సిపల్‌ అధికారులు వచ్చి తన విల్లాకు ‘ఇది అక్రమ నిర్మాణం’ అని ఫ్లెక్సీ తగిలించిపోయారు. అసలేం జరుగుతుందో బాధితుడికి అర్థం కాలేదు. అనుమతి పత్రాలున్నాయి.. రిజిస్ట్రేషన్‌ అయిపోయింది.. బ్యాంక్‌లోనూ మంజూరు చేసింది కదా అని నెత్తీ నోరూ బాదుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. పోనీ, సదరు యజమాని దగ్గరికి వెళ్దామంటే.. ఆ బిల్డర్‌ విదేశాలకు చెక్కేశాడు.  

ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితి ఓ విల్లా యజమానిది.. ఇలా ఒకరో ఇద్దరో కాదు మల్లంపేటలోని శ్రీ లక్ష్మి శ్రీనివాస కన్‌స్ట్రక్షన్స్‌ విల్లా ప్రాజెక్ట్‌ బాధితులు వందల సంఖ్యలోనే ఉన్నారు. 
 
ఆక్రమించి.. రహదారిగా చేసి.. 
మేడ్చల్‌ జిల్లా దుండిగల్‌ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట రెవెన్యూ పరిధిలోని 170/3,170/4,170/5 సర్వే నంబర్లలోని 15 ఎకరాల భూమిని పాతికేళ్ల క్రితం ముగ్గురు స్వాతంత్ర సమరయోధులకు ప్రభుత్వం కేటాయించింది. ఆ తర్వాత భూమి పలువురి చేతులు మారి.. కొన్నేళ్ల క్రితం శ్రీ లక్ష్మి శ్రీనివాస కన్‌స్ట్రక్షన్‌ సంస్థకు చేరింది.

మూడేళ్ల క్రితం 3.20 ఎకరాల స్థలంలో విల్లాల నిర్మాణం కోసం ఆ సంస్థ.. 6,418 చదరపు గజాలలో 35 విల్లాలు, 5,394 చదరపు గజాలలో మరో 30 విల్లాల నిర్మాణ అనుమతుల కోసం హెచ్‌ఎండీఏకు దరఖాస్తు చేసుకుంది.

ఆశ్చర్యకర విషయమేంటంటే.. సదరు భూమి మాస్టర్‌ ప్లాన్‌లో రెసిడెన్షియల్‌ జోన్‌లోనే లేదు. అయినా సరే హెచ్‌ఎండీఏ అనుమతులు ఇచ్చేసింది. పైపెచ్చు ఈ వెంచర్‌కు రహదారి కూడా లేదు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి రహదారిగా మలచడం గమనార్హం. 

నకిలీ అనుమతులు సృష్టించి.. 
2018లో మల్లంపేట గ్రామపంచాయతీగా ఉండేది. దీన్నే అవకాశంగా మలుచుకున్న నిర్మాణ సంస్థ.. గ్రామ పంచాయతీ అనుమతి పత్రాలు సృష్టించి అక్రమంగా 260 విల్లాలను నిర్మించింది. హెచ్‌ఎండీఏ అనుమతి ఇచ్చిన 65 విల్లాలకు పక్కనే మరో 15 ఎకరాల స్థలం ఉంది. దీన్ని ఆనుకొని కొత్త చెరువు ఉంది. ఆ 15 ఎకరాల్లో అప్పటి మల్లంపేట పంచాయతీ కార్యదర్శులు 260 విల్లాలకు నిర్మాణ అనుమతులు ఇచ్చినట్లు పత్రాలను సృష్టించారు.

ఇందులో 40 విల్లాలు చెరువు బఫర్‌జోన్‌లో ఉన్నాయి. చెరువు హద్దుల నిర్ధారణకు రెవెన్యూ, నీటిపారుదలశాఖ సంయుక్త సర్వే చేసినప్పటికీ, ఈ నివేదికను స్థానికంగా రెవెన్యూ అధికారులకు ఇరిగేషన్‌ అధికారులు ఇవ్వకపోవడం గమనార్హం.

చెరువులోకి మురుగు 
చెరువుకు ఆనుకుని ఉన్న 16 గుంటల ఎఫ్‌టీఎల్, మూడు ఎకరాల బఫర్‌ జోన్‌లో విల్లాలతో పాటు నిర్మాణ వ్యర్థాలతో ఏకంగా రోడ్డును ఏర్పాటు చేసింది. చెరువులో ఉన్న నీటిని మోటార్ల ద్వారా తోడి విల్లా నిర్మాణాలకు వినియోగిస్తున్నారు. విల్లాల మధ్య అంతర్గత రోడ్లు 30 అడుగుల వెడల్పు లేవు.

పైగా మురుగు నీరంతా కొత్త చెరువులో కలిసే విధంగా డ్రైయినేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్ట్‌కు విద్యుత్‌ శాఖ అధికారులు భూగర్భ కేబుల్‌ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. ఇంత వ్యవహారం జరుగుతున్నా నాలుగేళ్లుగా ఏ ఒక్క అధికారి నోరుమెదపలేందంటే ఈ వ్యవహారం వెనుక ఉన్న ‘పెద్దలు’ ఏ స్థాయిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. 
 
గుట్టు రట్టయిందిలా.. 
విల్లాల అక్రమ నిర్మాణాలపై స్థానికుల నుంచి ఫిర్యాదులు రావడంతో జిల్లా కలెక్టర్‌ హరీష్‌ సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ మేరకు డీపీఓ రమణ మూర్తి, డీఎల్‌పీఓ స్మిత క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి 260 విల్లాలకు అనుమతులు లేవని నిర్ధారించారు. దీంతో ఆయా విల్లాలను దుండిగల్‌ మున్సిపల్‌ అధికారులు సీజ్‌ చేశారు. బఫర్‌ జోన్‌లో ఉన్న విల్లాలను కూల్చివేసేందుకు పురపాలక అధికారులు ఉపక్రమించగా.. నిర్మాణ సంస్థ కోర్టును ఆశ్రయించి ‘స్టే’ తెచ్చుకోవటం కొసమెరుపు. 

   

మరిన్ని వార్తలు