15.74 ఎకరాలను నొక్కేసేందుకు కుట్ర

24 Aug, 2021 03:37 IST|Sakshi
ఘటన వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ హరినాథ్‌రెడ్డి

ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా మార్చిన వైనం

ఓ మహిళ, మరో ముగ్గురి అరెస్టు

వెంకటాచలం: ఆన్‌లైన్‌లో రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా మార్చిన కేసులో నలుగురు వ్యక్తులను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నెల్లూరు రూరల్‌ డీఎస్పీ హరినాథ్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లాకు చెందిన బొడ్డు గీత కొన్నినెలల క్రితం పొదలకూరు తహసీల్దార్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేసింది. ప్రస్తుతం గుడ్లూరు కార్యాలయంలో పనిచేస్తుంది. పొదలకూరులో పనిచేసే సమయంలో మండలంలోని అయ్యవారిపాళెం గ్రామానికి చెందిన పెంచలభాస్కర్‌తో గీతకు పరిచయం అయ్యింది. అతని చిన్నాన్న నలగర్ల కోటేశ్వరరావుకు ఓ వ్యక్తి కుంకుమపూడిలో ప్రభుత్వ పోరంబోకు 1.16 ఎకరాలు విక్రయించాడు. దీనిని పట్టా భూమిగా మార్చాలని కోటేశ్వరరావు పెంచల్‌భాస్కర్‌ను కోరాడు. దీంతో అతను  గీతను సంప్రదించాడు.

గీత రూ.2 లక్షలిస్తే పట్టా భూమిగా మార్పిస్తానని చెప్పి ఒప్పందం  కుదుర్చుకుంది. ఇందుకోసం కంప్యూటర్‌ ఆపరేటర్లు సైదాపురానికి చెందిన రాజేష్, కర్నూలుకు చెందిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డి సాయం కోరింది. గుడ్లూరు డిప్యూటీ తహసీల్దార్‌ అనారోగ్యం కారణంగా సెలవుపై ఉండడంతో అతని డిజిటల్‌ సిగ్నేచర్‌ కీ గీత వద్దనే ఉంది. రాజేష్, ప్రవీణ్‌ సాయంతో గత నెల 30వ తేదీన వెంకటాచలం తహసీల్దార్‌ యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఉపయోగించి వెబ్‌ల్యాండ్‌ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసింది.

ఆ తర్వాత గుడ్లూరు డీటీ సిగ్నేచర్‌ కీతో కాకుటూరు, కుంకుమపూడి పరిధిలోని 15.74 ఎకరాల ప్రభుత్వ భూములను పట్టా భూమిగా మార్చి బొడ్డు బుజ్జమ్మ, బొడ్డు మస్తానయ్య, బిక్కి మనెమ్మ, నలగర్ల కోటేశ్వరరావు పేర్లమీదమార్చి వేసింది.  విషయం అధికారులకు తెలియడంతో విచారణ చేయగా.. వినుకొండ తహసీల్దార్‌ కార్యాలయంలో పనిచేస్తున్న గొల్ల రామబ్రహ్మం బయోమెట్రిక్‌ అథెంటికేషన్‌ చేయగా, గీత డిజిటల్‌ సిగ్నేచర్‌ చేసి కుట్రపూరితంగా రికార్డులు తారుమారు చేసినట్లు గుర్తించారు. బొడ్డు గీత, పెంచలభాస్కర్, నలగర్ల కోటేశ్వరరావును అరెస్టు చేయగా, గొల్ల రామబ్రహ్మం వెంకటాచలం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. 

మరిన్ని వార్తలు