మణిపూర్‌లో తీవ్రవాదుల ఘాతుకం

14 Nov, 2021 05:07 IST|Sakshi
భార్య, కుమారుడితో విప్లవ్‌ (ఫైల్‌)

అస్సాం రైఫిల్స్‌ కాన్వాయ్‌పై మెరుపుదాడి

కల్నల్‌తోపాటు భార్య, కుమారుడు, నలుగురు జవాన్లు మృతి

ఇంఫాల్‌/న్యూఢిల్లీ: సరిహద్దు రాష్ట్రం మణిపూర్‌లో తీవ్రవాదులు రెచ్చిపోయారు. భద్రతా దళాల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకొని శనివారం ఉదయం మెరుపుదాడికి దిగారు. ఈ ఘటనలో ‘46 అస్సాం రైఫిల్స్‌’కు చెందిన ఖుగా బెటాలియన్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌ కల్నల్‌ విప్లవ్‌ త్రిపాఠి, ఆయన భార్య, కుమారుడితోపాటు మరో నలుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని ఉన్నతాధికారులు వెల్లడించారు.

ఈ దాడికి పాల్పడింది తామేనని పీపుల్స్‌ రివల్యూషనరీ పార్టీ ఆఫ్‌ కాంగ్లీపాక్‌(ప్రెపాక్‌), పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ) అనే తీవ్రవాద సంస్థలు ప్రకటించాయి. మణిపూర్‌ విముక్తి కోసం ఈ సంస్థలు పోరాడుతున్నాయి. చురాచాంద్‌పూర్‌ జిల్లాలోని సెఖాన్‌ గ్రామం వద్ద విప్లవ్‌ త్రిపాఠి తన భార్య, ఆరేళ్ల కుమారుడితోపాటు కాన్వాయ్‌లో వస్తుండగా తీవ్రవాదులు పేలుడు పదార్థాలను(ఐఈడీ) పేల్చారు. కాల్పులు సైతం జరిపారు. దీంతో కాన్వాయ్‌లో ఉన్న అస్సాం రైఫిల్స్‌ జవాన్లు సైతం ఎదురు కాల్పులు ప్రారంభించారు.

తీవ్రవాదుల దాడిలో కల్పల్‌ విప్లవ్‌ త్రిపాఠి, ఆయన భార్య, కుమారుడు, నలుగురు జవాన్లు మృతిచెందారు. గాయపడిన వారిని అధికారులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తీవ్రవాదుల దాడిలో మరణించిన కల్నల్‌ విప్లవ్‌ త్రిపాఠి గతంలో మిజోరాంలో పనిచేశారు. 2021 జూలైలో బదిలీపై మణిపూర్‌కు వచ్చారు. మిజోరాంలో ఉన్నప్పుడు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. డ్రగ్స్‌ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు. అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. విప్లవ్‌ త్రిపాఠి స్వస్థలం ఛత్తీస్‌గఢ్‌ లోని రాయ్‌గఢ్‌.
(చదవండి: అద్భుతం: తల్లి దీవెనలు.. తమ్ముడూ నీ బుర్రకు హ్యాట్సాఫ్‌)

ఏడుగురి ప్రాణ త్యాగాల్ని మర్చిపోలేం: మోదీ
మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌ కాన్వాయ్‌పై తీవ్రవాదులు దాడి చేసి, ఏడుగురి ప్రాణాలను బలిగొనడాన్ని ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. ఏడుగురి ప్రాణ త్యాగాల్ని ఎప్పటికీ మర్చిపోలేమని శనివారం ట్వీట్‌ చేశారు.

అది పిరికిపంద చర్య: రాజ్‌నాథ్‌ సింగ్‌
మణిపూర్‌లో తీవ్రవాదుల దాడిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పిరికిపంద చర్యగా అభివర్ణించారు. తీవ్రవాదులను కచ్చితంగా న్యాయస్థానం ముందు నిలబెడతామని చెప్పారు. ఐదుగురు యోధులను దేశం కోల్పోయిందని అన్నారు.
చదవండి: ‘‘ఇవాళ ఉన్నాం. రేపుంటామో లేదో!’’

ఏమిటీ పీఎల్‌ఏ?
మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌ జవాన్లపై తీవ్రవాదుల దాడి నేపథ్యంలో పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ) మరోసారి తెరపైకి వచ్చింది. ఈ సంస్థను 1978 సెప్టెంబర్‌ 25న ఎన్‌.బిశ్వేశ్వర్‌ సింగ్‌ ప్రారంభించారు. మణిపూర్‌కు భారతదేశం నుంచి విముక్తి కలిగించి, స్వతంత్ర దేశంగా మార్చడమే తమ సంస్థ ధ్యేయమని ప్రకటించారు. మార్క్సిజం–లెనినిజం సిద్ధాంతాలు, మావో ఆలోచనా విధానంపై ఆధారపడి పీఎల్‌ఏ పనిచేస్తోంది. పీఎల్‌ఏకు చైనా ప్రభుత్వం నుంచి అండదండలు లభిస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లోని ఇతర తీవ్రవాద, వేర్పాటువాద సంస్థలతో పీఎల్‌ఏ చేతులు కలిపింది. ఉమ్మడి శత్రువైన భారతదేశాన్ని ఓడించడానికి ఆయా సంస్థలు ఒక్క తాటిపైకి వచ్చాయి. పీఎల్‌ఏ 1989లో రివల్యూషనరీ పీపుల్స్‌ ఫ్రంట్‌(ఆర్‌పీఎఫ్‌) పేరిట ఒక రాజకీయ విభాగాన్ని ప్రారంభించింది. మణిపూర్‌ పీపుల్స్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌లో పీఎల్‌ఏ భాగస్వామిగా చేరింది.

మరిన్ని వార్తలు