విషయం తెలియడంతో భార్యపై సిద్ధిఖీ ఆగ్రహం, దాంతో

7 Apr, 2021 11:28 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న వెస్ట్‌జోన్‌ డీసీపీ శ్రీనివాస్‌, ఇన్‌సెట్లో నిందితురాలు రుబీనా

సిద్దిఖీ హత్య కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు 

ప్రియుడు మహ్మద్‌ అలీతో హత్య చేయించిన భార్య  

వివరాలు వెల్లడించిన వెస్ట్‌జోన్‌ డీసీపీ శ్రీనివాస్‌ 

బంజారాహిల్స్‌: జూబ్లీహిల్స్‌ కార్మికనగర్‌లో టైలర్‌ సిద్దిఖీ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. తమ వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే కారణంతో సిద్దిఖీ భార్య రుబీనా పక్కా ప్రణాళికతో ప్రియుడు సయ్యద్‌ మహ్మద్‌ అలీచే హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. మంగళవారం జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో వెస్ట్‌ జోన్‌ డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్, బంజారాహిల్స్‌ ఏసీపీ సుదర్శన్, జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌రెడ్డితో కలిసి వివరాలను వెల్లడించారు.

కార్మికనగర్‌లో నివసించే మహ్మద్‌ సిద్దిఖీ అహ్మద్‌ (40), రుబీనా దంపతులు. సిద్దిఖీ టైలర్‌ పని చేస్తుంటాడు. ఈ క్రమంలో బోరబండ అక్బర్‌ మసీద్‌ ప్రాంతానికి చెందిన సయ్యద్‌ మహ్మద్‌ అలీ (22)తో రుబీనాకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలియడంతో భార్యపై సిద్దిఖీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తమ ‘బంధానికి’ అడ్డుగా ఉన్న సిద్దిఖీని అంతమొందించేందుకు మహ్మద్‌ అలీ పక్కా పథకం వేశాడు.

గత నెల 31న అర్ధరాత్రి ఇంటిలో ఒంటరిగా ఉన్న సిద్దిఖీ తలపై బైక్‌ షాక్‌ అబ్జర్వర్‌ రాడ్‌తో బలంగా బాది హత్య చేశాడు. ఈ నెల 1న మృతుడి సోదరుడు అతీక్‌ అహ్మద్‌ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజీలు, సెల్‌ఫోన్‌ సిగ్నళ్ల ఆధారంగా నిందితుణ్ని అదే రోజు రాత్రి అదుపులోకి తీసుకుని విచారణ చేయగా.. అడ్డు తొలగించుకోవడానికి హత్య చేసినట్లుగా అంగీకరించాడు. హత్యకు ముందు.. ఆ  తర్వాత మృతుడి భార్య రుబీనాతో నిందితుడు మహ్మద్‌ అలీ మాట్లాడినట్లు విచారణలో తేలింది. వీరిద్దరూ కలిసే సిద్దిఖీ హత్యకు పథకం వేసినట్లు నిర్ధారించి నిందితులను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు