అమ్మ సన్నిధిలో అవినీతి తాండవం 

24 Feb, 2021 08:28 IST|Sakshi

ఇక్కడ పనిచేసే ఉద్యోగులే అక్రమార్జనకు తెరతీసిన వైనం 

ఏళ్లుగా ఒకే చోట పాతుకుపోయి ఇష్టారీతిన వ్యవహరించిన తీరు

 ఏసీబీ సోదాల్లో తేటతెల్లమైన అధికారుల గుట్టు

 దుర్గగుడిలో మొత్తం 15 మంది సస్పెన్షన్‌ 

ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ : దుర్గగుడిలో అవినీతి తాండవం చేస్తోంది. ఇంటి దొంగలే అమ్మ సొమ్మును పక్కదారి పట్టిస్తున్నారు. గత గురువారం నుంచి ఇంద్రకీలాద్రి దేవస్థానంలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి నివేదికను అందించారు. దీంతో దేవదాయ శాఖ మొత్తం 15 మంది దుర్గగుడి అధికారులు, సిబ్బందిని సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే సస్పెండ్‌ అయిన వారిలో ఏళ్లుగా ఒకే చోట పాతుకుపోయిన వారే ఉన్నారు. ఈవోలకు అనుకూలంగా వ్యవహరిస్తూ తమతో పాటు తమకు అనుగుణంగా ఉన్న వారిని ఆదాయం వచ్చే చోట పోస్టింగ్‌లు ఇచ్చే వారే ఉన్నారు. 

► సస్పెండ్‌ అయిన సూపరిండెంటెంట్‌లలో ఒకరు గత ఐదేళ్ల కాలంగా అంతరాలయంలోనే తిష్ట వేసుకుని కూర్చున్నారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలకు అనుకూలంగా ఉన్న వారు ప్రభుత్వం మారిన వెంటనే స్థానిక ప్రజా ప్రతినిధి అండదండలతో ఉద్యోగం చేస్తున్న చోట ఏడాదిన్నర కాలం వెళ్లదీశారు. 

► అలాగే దేవస్థాన పరిపాలనా విభాగంలో 9 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న మరో ఉద్యోగి పైన వేటు పడింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో తెలంగాణ నుంచి వచ్చిన సదరు ఉద్యోగి అదే విభాగంలో 9 ఏళ్లు విధులు నిర్వహిస్తున్నాడంటే అధికారులకు ఆ ఉద్యోగి మాట ఎంత బలంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. గుమస్తా దగ్గర నుంచి సూపరిండెంటెంట్‌ వరకు తన మాటల చాతుర్యంలో ఈవోలను ఆకట్టుకోవడమే కాకుండా డ్యూటీల మారేందుకు లక్షలాది రూపాయలు వసూలు చేసేవాడని ప్రచారంలో ఉంది.  

ఈవోలకు అనుకూలంగా మారితేనే.. 
దేవస్థానానికి ఎవరు ఈవోగా వచ్చిన వారి సొంత కోటరిని ఏర్పాటు చేసుకోవడం దుర్గగుడిపై పరిపాటిగా మారింది. గతంలో ఇద్దరు మహిళా అధికారులు వచ్చినప్పుడు సైతం ఇదే సూత్రం నడిచింది. అర్హతలు లేకపోయినా అధికారుల మాటలు వింటారనే కారణంతో రికార్డు అసిస్టెంట్లు, సీనియర్‌ అసిస్టెంట్లకు ఏఈవో స్థాయి బాధ్యతలు అప్పగించిన సందర్భాలు ఉన్నాయి. దుర్గగుడిపై చీరల విభాగం, ప్రసాదాలు, అన్నదానం, ఈవో పేషీలు కీలకంగా మారుతున్నాయి. పని చేయగలిగిన సత్తా ఉన్న వారిని సైతం నామమాత్రం పనులు ఉన్న విభాగాలలో విధులు కేటాయింపులు చేస్తున్నారు.  

అంతర్గత బదిలీల్లోనూ అవకతవకలు.. 
దుర్గగుడిలో ప్రతి ఆరు నెలలకు ఒక సారి అంతర్గత బదిలీలు జరిగేవి. అయితే గత రెండు, మూడేళ్లగా అంతర్గత బదిలీలు సక్రమంగా జరగడం లేదు. ఆదాయం వచ్చే విభాగాలలో విధులు నిర్వహించే వారు తమ స్థానం మరొకరికి దక్కకుండా లక్షలాది రూపాయలు ఈవోలకు సమరి్పంచి అంతర్గత బదిలీలను నిలుపుకుంటున్నారు. 
తాజాగా ఏసీబీ అధికారుల దాడులకు రెండు రోజుల ముందు కూడా జరిగిన అంతర్గత బదిలీలలో పెద్ద మొత్తంలో చేతులు మారినట్లు సమాచారం. ఈ బదిలీలలో కొంత మంది సూపరిండెంటెంట్‌లను కనీసం ఉన్న చోట నుంచి పక్కకు కూడా జరపకపోగా, అధికారుల మాట వినడం లేదనే కారణంగా మరి కొంత మందిని యథాస్థానంలోనే ఉంచేశారు.  దీనిపైన కూడా దేవస్థానంలో పెద్ద ఎత్తున దూమారం లేస్తుంది.  

ఖాళీల భర్తీ ఎలా?
ప్రస్తుతం ఏసీబీ అధికారుల దాడుల నేపథ్యంలో పలు విభాగాలు ఖాళీలు ఏర్పడ్డాయి. అయితే ప్రస్తుతం ఆలయంలో పరిపాలన సక్రమంగా జరగాలంటే అధికారులకు బాధ్యతలను సక్రమంగా పంపిణీ చేస్తేనే సాధ్యపడుతుంది. దాడుల తర్వాత మరి దుర్గగుడి అధికారుల వ్యవహార శైలి ఏ విధంగా మారుతుందో వేచి చూడాలి.  

అక్రమాలపై ముందే హెచ్చరించిన ‘సాక్షి’ 
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): దుర్గగుడిలో అవినీతి జరుగుతోందని ‘సాక్షి’ పలు మార్లు కథనాలు ప్రచురించింది. గత ఏడాది దసరా, భవానీ దీక్షలతో పాటు సంక్రాంతి పర్వదినాలలో టికెట్ల రీసైక్లిలింగ్‌ జరుగుతుందని చెప్పింది. గత నెల 21వ తేదీన ‘దుర్గగుడిలో ఇంటి దొంగలు’, 29న ‘అమ్మ సొమ్మంటే అలుసా’ అనే శీర్షికన కథనాలను ప్రచురించింది. ఈ కథనాలతో పాటు వారికి అందిన సమాచారంతో ఏసీబీ అధికారులు గత గురువారం దుర్గగుడిలోని వివిధ విభాగాలపై ఏక కాలంలో దాడులు నిర్వహించారు. టికెట్ల రీసైక్లిలింగ్, ప్రసాదాల కౌంటర్లలో గోల్‌మాల్‌ వ్యవహారాలతో పాటు అన్నదానం, చీరల కౌంటర్లు, స్టోర్స్, పరిపాలనా విభాగాలలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో పెద్ద ఎత్తున లోపాలను గుర్తించిన ఏసీబీ అధికారులు దేవదాయ శాఖకు ప్రాథమిక నివేదికను అందజేయడంతో ఆలయంలో కీలకంగా ఉన్న పలువురు సూపరిండెంటెంట్‌లను సస్పెండ్‌ చేసింది. దేవదాయ శాఖలోనే ఇంత పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించడం, ఇంత మంది అధికారులను, సిబ్బందిని సస్పెండ్‌ చేయడం ఇదే ప్రథమం. గతంలో శ్రీశైలం దేవస్థానంలో టికెట్ల కుంభకోణంలో 11 మంది ఆలయ అధికారులు, సిబ్బందిపై సస్పెండ్‌ వేటు వేయగా, తాజాగా దుర్గగుడిలో 15 మందిపై వేటు వేయడం, మరి కొంత మంది అధికారులపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేయడం చర్చనీయాంశమైంది. 

 

మరిన్ని వార్తలు