ఉద్యోగమిస్తామని ఊబిలోకి నెట్టారు

1 Aug, 2020 11:39 IST|Sakshi

అసోం నుంచి నగరానికి వచ్చిన యువతి

ఉద్యోగమిస్తామని గుజరాత్‌కు తీసుకెళ్లిన ఓ జంట

వ్యభిచారం చేయాలంటూ బెదిరించిన దంపతులు 

యువతి సమాచారంతో రంగంలోకి వత్వా పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌: ఉద్యోగం కోసం ఎక్కడినుంచో నగరానికి వచ్చిన ఓ యువతికి మాయమాటలు చెప్పి రాష్ట్రాలు దాటించి వ్యభిచార ఊబిలోకి నెట్టింది ఓ జంట. భాషకాని భాష, ప్రాంతం కాని ప్రాంతంలో ధైర్యాన్ని కూడదీసుకుని పోలీసులకు సమాచారమిచ్చి ఆ వ్యభిచార ఊబి నుంచి బయటపడింది ఓ యువతి. వివరాలిలా ఉన్నాయి. అసోంలోని ఓ ప్రైవేట్‌ సంస్థలో పని చేసే ఓ యువతి కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ ప్రభావాలతో బతుకుదెరువు కోల్పోయింది. దీంతో ఉద్యోగం కోసం అసోంకు చెందిన ఓ యువతి అక్కడ్నుంచి హైదరాబాద్‌కు వచ్చింది. లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత వచ్చిన ఆమె ఇక్కడి ఓ లాడ్జిలో బస చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేసింది. ప్రస్తుతం నగరంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆమె ప్రయత్నాలు ఫలించలేదు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న ఆమెకు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నుంచి వచ్చి నగరంలో నివసిస్తున్న భార్యాభర్తలు సుమన్‌ ఖురేషీ, సోను ఖురేషీలతో పరిచయమైంది.

ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్‌లో ఉద్యోగం దొరకడం కష్టమని చెప్పి తమతో గుజరాత్‌కు వస్తే అహ్మదాబాద్‌ నగరంలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ యువతితో నమ్మబలికారు. వీరి మాటలు నమ్మిన ఆ యువతి వారితో వెళ్లేందు కు అంగీకరించింది. గత నెల మొదటి వారం లో యువతిని అహ్మదాబాద్‌ తీసుకువెళ్లిన సుమన్, సోనులు అక్కడి వత్వా ప్రాంతంలో ని ఓ లాడ్జిలో ఉంచి సదరు భార్యాభర్తలు తమకు పరిచయస్తుల్ని విటులుగా తీసుకొచ్చేవారు. ఆ పని చేయడానికి యువతి నిరాకరించడంతో బెదిరింపులకు దిగారు. ఆ యువతి మొబైల్‌ లాక్కుని స్విచ్ఛాప్‌ చేసేశారు. ఈ క్రమంలో గత శనివారం రాత్రి ధైర్యం చేసి తన ఫోన్‌ చేజిక్కించుని పోలీసులకు సమాచారమందించింది.

దీంతో వత్వా పోలీసులు రంగంలోకి దిగి యువతిని రక్షించారు. బాధితురాలు చెప్పిన వివరాల ఆధారంగా నిందితులపై కేసు నమోదు చేసుకు న్నారు. బాధితురాలు అస్సామీ తప్ప మరో భాష మాట్లాడలేకపోవడంతో ఓ దుబాసీని ఏర్పాటు చేసి బాధితురాలి వాంగ్మూలం నమోదు చేశారు. కాగా నిందితుల్లో ఒకరైన సోను ఖురేషీ తప్పించుకునే ప్రయత్నంలో ఖోఖ్రా ప్రాంతంలో పోలీసులకు చిక్కాడు. నిందితురాలు సుమన్‌ ఖురేషీ కోసం పోలీసు లు గాలిస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా ఓ బృందాన్ని హైదరాబాద్‌ పంపడానికి వత్వా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నిందితులంతా కలసి సెక్స్‌ రాకెట్‌ నిర్వహిస్తున్నట్లు అహ్మదాబాద్‌ పోలీసులు అనుమానిస్తున్నారు. వత్వాలో నిందితులకు సహకరించిన వారిని గుర్తించే పనిలో పడ్డారు.

మరిన్ని వార్తలు