దంపతుల ఆత్మహత్య.. కుమారుడు లేని లోకంలో ఉండలేక.. 

30 May, 2022 15:39 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

జి.కొండూరు (మైలవరం)\కృష్ణా జిల్లా: చేతికి అందివచ్చిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు లోనై ఆత్మహత్యకు పాల్పడ్డారు. జి.కొండూరు మండలంలో చిన్ననందిగామలో ఆదివారం జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. పోలీసుల కథనం మేరకు.. చిన్ననందిగామ గ్రామానికి చెందిన ఆరేపల్లి సాంబశివరావు(43), ఆరేపల్లి విజయలక్ష్మి(38) దంపతులకు కుమార్తె దీపిక, కుమారుడు జగదీష్‌పవన్‌ ఉన్నారు.
చదవండి: లోకం తెలియని చిన్నారులు.. రోజూ నరకమే.. అందుకే వచ్చేశాం..

పదేళ్ల కిందట సాంబశివరావు తాటిచెట్టుపై నుంచి పడి నడుము విరగడంతో దివ్యాంగుడిగా మారాడు. అయినప్పటికీ భార్యతో వ్యవసాయ పనులు చేయిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పదో తరగతి పూర్తి చేసిన కుమారుడు జగదీష్‌పవన్‌ మైలవరంలోని ఓ టీవీ షాపులో మెకానిక్‌గా చేరాడు. గత మార్చి 29వ తేదీన రాత్రి విధులు ముగించుకుని బైకుపై ఇంటికి వస్తూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచాడు.

కుమారుడి మృతిని జీర్ణించుకోలేని తల్లిదండ్రులు విజయలక్ష్మి, సాంబశివరావు రెండు నెలల నుంచి తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఆదివారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో వంట గదిలో రేకుల షెడ్డుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉదయాన్నే నిద్ర లేచిన కూతురు దీపికకు వారు వంటగదిలో విగతజీవులుగా కనిపించడంతో భయపడిపోయింది. బంధువులు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ ధర్మరాజు తెలిపారు.    

మరిన్ని వార్తలు