గుండెల్ని మెలిపెట్టే విషాద ఘటన.. ‘అమ్మానాన్నను త్వరగా రమ్మని చెప్పండి’..

3 Dec, 2022 13:29 IST|Sakshi

దొరవారిసత్రం(తిరుపతి జిల్లా): ‘బ్యాంక్‌లో ఉన్న డబ్బు తీసుకువస్తాం.. మీరు ఇంటి వద్దే ఆడుకుంటూ ఉండండి.. మీకు ఇప్పుడే అప్పచ్చులు(చిరుతిళ్లు) తీసుకొస్తాం’ అంటూ వెళ్లిన తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలొదలగా.. మా అమ్మానాన్నను త్వరగా రమ్మని చెప్పండి అంటూ తమను ఓదార్చడానికి వచ్చేవారికి ఆ దంపతుల పిల్లలు చెప్పడం అక్కడివారిని కలిచివేసింది.

ఈ ఘటన మండలంలో విషాదాన్ని నింపింది. వివరాలు.. నెల్లూరుపల్లి గ్రామ పరిధిలోని ఎస్టీ కాలనీకి చెందిన తుపాకుల మునస్వామి(30), భార్య సునీత(27) దంపతులు. వీరికి సుప్రియ (9), ముఖేష్‌ (7) పిల్లలు ఉన్నారు. శుక్రవారం నెల్లబల్లి గ్రామంలోని ఏటీఎంకు వెళ్లి బ్యాంక్‌ ఖాతాలో పడిన ఉపాధి డబ్బులు తీసుకొస్తామని దంపతులు బైక్‌పై బయలుదేరి వెళ్లారు. నగదు తీసుకుని మార్గమధ్యంలో పిల్లలకు కావాల్సిన తినుబండారాలను కొనుగోలు చేశారు.

ఆపై స్వగ్రామానికి బయలుదేరారు. నెల్లబల్లి గ్రామ సమీపంలోని దాబా వద్ద జాతీయ రహదారిపై  లారీని అధిగమించే ప్రయత్నంలో ముందువెళ్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో మునస్వామి, సుప్రియ అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

మునస్వామి, సునీత దంపతుల పిల్లలు సుప్రియ, ముఖేష్‌ స్థానిక ప్రాథమిక పాఠశా లలో చదువుతున్నారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన తమ అమ్మానాన్నలకు ఏమైందో తెలియక పిల్లలు తల్లడిల్లిపోయారు. అమ్మానాన్న అప్పచ్చులు తీసుకొని ఎప్పుడొస్తారంటూ అక్కడ ఉన్న వారిని దీనంగా అడగడం గుండెల్ని మెలిపెట్టింది. మా అమ్మానాన్నను త్వరగా రమ్మని చెప్పండి అంటూ వారిని ఓదార్చడానికి వచ్చేవారికి చెప్పడం పలువురిని కంటతడి పెట్టించింది.
చదవండి: Rain Alet: దక్షిణ కోస్తా వైపునకు వాయుగుండం!.. భారీ వర్షాలకు అవకాశం 

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు