హెచ్‌1 వీసా ఇప్పిస్తామంటూ.. రూ. 10కోట్లకు టోకరా

7 Dec, 2020 12:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎఫ్‌1 వీసా ఉన్న విద్యార్థులకు హెచ్‌1 వీసా ఇప్పిస్తామంటూ ఓ జంట అమెరికాలోని తెలుగు విద్యార్థులను నట్టేట ముంచింది. స్టూడెంట్స్‌ వద్ద నుంచి సుమారు 10 కోట్ల రూపాయల వరకు వసూలు చేసి.. పరారయ్యింది ఈ జంట. వివరాలు.. నిందితులు ముత్యాల సునీల్‌, ప్రణీతలు అమెరికాలో ఉన్న తెలుగు విద్యార్థులను హెచ్‌1 వీసా పేరిట మోసం చేశారు. ఎఫ్‌1 వీసా ఉన్న విద్యార్థులకు హెచ్‌1 వీసా ఇప్పిస్తామంటూ విద్యార్థుల దగ్గర నుంచి భారీగా డబ్బు వసూలు చేశారు. ఒక్కో విద్యార్థి దగ్గరి నుంచి 25 వేల డాలర్లు వసూలు చేశారు. ఈ మోసానికి సంబంధించి 30 మంది తెలుగు విద్యార్థులు నార్త్ కరోలినా హోం ల్యాండ్ సెక్యూరిటీలో ఫిర్యాదు చేశారు. దీంతో ఇంటర్‌పోల్ ముత్యాల సునీల్, ప్రణీతలపైన లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం సునీల్, ప్రణీత పరారీలో ఉన్నారు. (చదవండి: అమెరికా చదువులకు మన ఖర్చెంతో తెలుసా?)

ఇక, విద్యార్థుల నుంచి వసూలు చేసిన డబ్బులను సునీల్ తన తండ్రి ముత్యాల సత్యనారాయణ అకౌంట్‌కు బదిలీ చేశాడు. దీంతో ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరిలో ఉంటున్న సత్యనారాయణ కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టాడు. ఈ ఘటన వెలుగుచూడటంతో సత్యనారాయణ కూడా పరారీలోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం పోలీసులు సత్యనారాయణ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరిన్ని వార్తలు