కరస్పాండెంట్‌ దంపతులను కాటేసిన అప్పులు

16 Aug, 2021 19:06 IST|Sakshi
సుబ్రమణ్యం(ఫైల్‌)- రోహిణి(ఫైల్‌)

నిద్ర మాత్రలు మింగి భార్యాభర్త ఆత్మహత్య

కోవెలకుంట్ల పట్టణంలో విషాదం 

కోవెలకుంట్ల(కర్నూలు జిల్లా): అప్పులు తీర్చే మార్గం కానరాక కోవెలకుంట్ల పట్టణంలోని లైఫ్‌ఎనర్జీ స్కూల్‌ కరస్పాండెంట్‌ దంపతులు సుబ్రమణ్యం(34), రోహిణి(28) ఆదివారం బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు.. పట్టణానికి చెందిన రాధాకృష్ణమూర్తి స్థానిక వాసవీ బొమ్మిడాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేసి ఎనిమిది సంవత్సరాల క్రితం పదవీ విరమణ పొందారు. ఈయన కుమారుడు సుబ్రమణ్యం ఇదే కళాశాలలో కొంతకాలం కాంట్రాక్ట్‌ బేసిక్‌పై కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేశాడు. ఉద్యోగానికి రాజీనామా చేసి పట్టణంలో 2017 నుంచి సొంతంగా ప్రైవేట్‌ పాఠశాల నడుపుతున్నాడు.

ఈ క్రమంలో ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద రూ. 2.50 కోట్ల అప్పులు చేశాడు. కరోనాతో ఏడాదిన్నర కాలంగా పాఠశాల సక్రమంగా నడవకపోవడంతో అప్పులు చెల్లించలేకపోయాడు. అప్పుదారులు ఒత్తిడి తీసుకురావడంతో మనస్తాపం చెందిన భార్యాభర్తలు ఆదివారం ఉదయం ఇంట్లో నుంచి భార్య స్వగ్రామమైన ఆత్మకూరుకు బయలుదేరారు. అప్పుదారుల వేధింపులతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మార్గమధ్యలో వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టి మొబైల్‌ ఫోన్స్‌ స్విచ్‌ఆఫ్‌ చేసుకున్నారు.

ఆత్మకూరు దగ్గర లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సమీపంలో నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితికి చేరుకున్నారు. అటుగా వెళుతున్న వ్యక్తులు గమనించి ఆత్మకూరు పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించగా అక్కడ చికిత్స పొందుతూ సుబ్రమణ్యం మృతి చెందాడు. రోహిణికి ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలిస్తుండగా   మృతి చెందింది. విషయం తెలియడంతో మృతుని తండ్రి, బంధువులు హుటాహుటినా ఆత్మకూరుకు బయలుదేరి వెళ్లారు.  

మరిన్ని వార్తలు